హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): వీధివ్యాపారుల నుంచి కార్పొరేట్ హోటళ్ల వరకు ప్రతి ఒక్కరూ నాణ్యతతోపాటు పరిశుభ్రత కూడా పాటించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఫుడ్‌సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. వీధివ్యాపారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ విషయంలో నిబంధనలు పాటించేవారికి అం డగా ఉంటామని, తప్పుచేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ ఫిర్యాదుల స్వీకరణ, పరిషారం కోసం కలెక్టరేట్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్న ట్టు ప్రకటించారు. నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కొత్త ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో 3,774 హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వెం డర్స్కు లైసెన్సులు ఇచ్చినట్టు ఫుడ్‌సేఫ్టీ అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డైరెక్టర్ శివలీల పాల్గొన్నారు.