హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరికీ వ్యతిరేకం కాదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ సమానులేనని చెప్పారు. ఈ తీర్పుతో మొత్తం మాదిగజాతి తలరాతలు మారబోవని, 15 శాతం రిజర్వేషన్ వస్తే మిగతా 85 శాతం కోసం పోటీపడేలా యువత సిద్ధంకావాలని సూచించారు. శనివారం హైదరాబాద్ హరితప్లాజాలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిందని తెలిపారు. 600 పేజీల తీర్పును మేధావులు పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తే.. కమిటీవేసి పూర్తిస్థాయిలో చర్చించి ఆర్డినెన్స్‌కు చర్యలు చేపడుతుందని చెప్పారు. దేశంలో తెలంగాణలోనే తీర్పు తొలుత అమలుకానున్నదని, మాదిగజాతి కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో మాదిగల సమ్మేళనం నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డిని సన్మానించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం చర్యలు చేపట్టిందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. వర్గీకరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ ప్రతిని మోదీకి అందించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న మాదిగజాతి ఎటు ఓటు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, తద్వారా హక్కులను సాధించుకోవాలని సూచించారు. తాను లీడర్‌గా తయారుచేసిన మొదటి వ్యక్తి మంద కృష్ణ అని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వీరేశం, సామేలు, లక్ష్మీకాంతారావు, సత్యనారాయణ, యాదయ్య, మాజీ మంత్రి పుష్పలీల, నాయకులు సంపత్‌కుమార్, పిడమర్తి రవి, ప్రొఫెసర్ కాశీం, రాష్ట్ర దళిత ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.