Bandi Sanjay | కరీంనగర్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని అంటున్నాడని, అతడిని క్రిమినల్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తన కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు.
కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో ఆయన మాట్లాడారు. ‘ఆ బాలికతో ఫ్రెండ్స్‌లాగా కలిసి ఉన్నాం తప్ప ఏ తప్పూ చేయలేదని నా కొడుకు చెప్తున్నడు. అయినా నేను సమర్థించడం లేదు. తప్పు ఎవరూ చేసినా.. అది నా కొడుకైనా సరే చట్టం ముందు అందరూ సమానులే. నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే’ అని అన్నారు.
ఈ ఘటనతో బ్యాంకులో ఉద్యోగం చేసే తన సతీమణి సెలవు పెట్టిందని, కన్నపేగు ఏడుస్తున్నది, తల్లడిల్లుతున్నదని చెప్పారు. తన కుటుంబంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి జరుగుతున్నదని ఆరోపించారు. ఈ ఒక్క ఘటనే తమను ఇంతగా ఇబ్బంది పెడుతుంటే.. 29 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి తల్లుల బాధలు ఎలా ఉంటాయో ఇప్పుడు అర్థమవుతున్నదని అన్నారు.
‘కాషాయ జెండా పట్టి తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఎవరైతే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారో, ఎవరైతే నా కుటుంబాన్ని బజారులో పడేశారో.. నా కార్యకర్తల్లో ఆవేదన కలిగించారో.. అందులో ఏ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టే ప్రసక్తేలేదు’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.