హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రైతుల భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అమలులో భాగంగా ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని, ఈ సదస్సులకు కలెక్టర్లు హాజరుకావాలని, రైతుల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (ఎంసీహెచ్ఆర్డీ) సోమవారం నిర్వహించిన సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, వేసవి తాగునీటి ప్రణాళికపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని వెల్లడించారు. ఆయా సదస్సులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరువుతారని తెలిపారు. గ్రామస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని, అనంతరం ఆ జాబితాను జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదించాకే ఖరారు చేయాలని స్పష్టంచేశారు. వేసవిలో ఎకడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధచూపాలని సీఎం సూచించారు.
నీటి పారుదల, తాగునీటి, విద్యుత్తు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజావాణి సమీక్ష సందర్భంగా జిల్లాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాలను ప్రజాభవన్‌లో జరిగే ప్రజావాణి డ్యాష్‌బోర్డుతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. సమీక్ష సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.