‘నేను మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన. నేను డబ్బున్నోడిని కాదు. నా తండ్రి కేంద్ర మంత్రి కాదు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా ఉద్రేకంగా మాట్లాడే శక్తి ఉన్నవాడినీ కాను. నేను చాలా చిన్నస్థాయి వ్యక్తిని. వాళ్లు అట్లా మాట్లాడుతారని నేను కలలో కూడా ఊహించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా నన్ను తిట్టినా భరించేవాణ్ని. కానీ నా జాతిని తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న. నేను మాదిగను కాబట్టే.. నాకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా నన్ను తిట్టడమంటే మాదిగ జాతిని తిట్టడమే– అడ్లూరి లక్ష్మణ్
ఆదినుంచీ అగ్రకులాలకు పెద్దపీట వేసే కాంగ్రెస్‌లో దళితులకు దక్కుతున్నది చివరి కుర్చీనే! ఒక్కోసారి అదీ లేదు! ఒకవేళ దక్కినా అడుగడుగునా అవమానాలే! ప్రభుత్వం ఏర్పడిన 18నెలలపాటు దళితమంత్రి లేకుండానే పాలన సాగించిన రేవంత్ సర్కారు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు కల్పించారు. ఇప్పుడు ఆ మంత్రికీ అవమానాలు! అంతర్గత ప్రజాస్వామ్యం ముసుగులో సహచర మంత్రులే అనుచితంగా, అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా నిలువరించలేని నాయకత్వం ఆ పార్టీది. ఒకవైపు 42 శాతం కోటా పేరిట డ్రామాలు ఆడుతూ బహుజనులకు ధోకా! మరోవైపు అమాత్యులనే అవమానిస్తూ దళితవర్గానికి దగా! ఇదీ కాంగ్రెస్ మార్క్ సమభావన!
హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): తనను దున్నపోతు అంటూ అవమానించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇప్పటికైనా పొరపాటు తెలుసుకొని క్షమాపణలు చెప్పాలి.. లేదంటే జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు’ అంటూ హెచ్చరించారు. మరో మంత్రి గడ్డం వివేక్‌పైనా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం రహ్మత్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ‘ఏం తెలుసు..ఆ దున్నపోతుగాడికి’ అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కించపరిచేలా మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంపై అడ్లూరి సోమవారం స్పందించారు. రఘు అనే వ్యక్తితో జరిగిన సంఘటనను ఫోన్లో వివరించారు. తనకు జరిగిన అవమానంపై స్పందించిన మాదిగ జాతి పెద్దలకు, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
వాస్తవాన్ని ఒప్పుకొని పొన్నం క్షమాపణ కోరితే ఆయనకు గౌరవంగా ఉంటుందని సూచించారు. వ్యక్తిగతంగా తనను కించపరిచినదానికి క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పారు. ‘రేపటి వరకు చూస్తా.. అయినా పొన్నం ప్రభాకర్‌లో మార్పు రాకుంటే.. నేను అనలేదు అని అంటే రేపటి నుంచి జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు’ అని హెచ్చరించారు. ‘మంత్రి పొన్నం తన వ్యాఖ్యలను సరిచేసుకుంటారని అనుకున్నా, ఫోన్ చేసి మాట్లాడుతారేమో అనుకున్నా.. కానీ ఇప్పటి వరకు ఒక్క ఫోన్ చేయలే.. పైగా ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నేను ఆయన్ను అనలేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు’ అంటూ వాపోయారు.
వాడి లెక్కెంత అని వివేక్ అనుకుంటరు
మంత్రి వివేక్ కూడా తనను అవమానించారని అడ్లూరి ఆరోపించారు. ‘ఆయన మా వర్గం మంత్రి అయినా ఆయన కూడా నేనుండ వెళ్లిపోతా అన్నడు’ అని వివరించారు. ‘ఇద్దరం ఒక వర్గం నుంచి వచ్చినవాళ్లమే. ఆయన కొడుకు ఎంపీగా నిలబడితే మేం మీదేసుకొని గెలిపించినం. ఆయన తండ్రి నుంచి మేం అండగా ఉన్నం. అలాంటిది మంత్రి పొన్నం నన్ను దున్నపోతా అని తిడుతుంటే మా మంత్రిని దున్నపోతని ఎట్ల అంటున్నవ్ అని అభ్యంతరం చెప్పలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి నేను వాళ్లకు సమకాలికంగా ఎదగడం, ఆయన పక్కన కూర్చోవడం వివేక్‌కు ఇష్టం లేదు. మంత్రి వివేక్ మొదటి నుంచీ మా వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. మా వర్గీకరణను కూడా వ్యతిరేకిస్తున్నారు. మాదిగ వర్గానికి చెందినోడు నా పక్కన కూర్చుంటాడా.. వాడి లెక్కెంత’ అని వివేక్ అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాదిగ వర్గంలో పుట్టినందుకే అవమానాలు
‘మాదిగ సామాజిక వర్గంలో పుట్టడమే మేం చేసిన పాపమా? ఆ సామాజిక వర్గం నుంచి మంత్రిని కావడమే మా దురదృష్టమా? మాదిగ సామాజికవర్గంలో పుట్టాం కాబట్టే ఇలాంటి అవమానాలు భరించాల్సి వస్తున్నది’ అంటూ అడ్లూరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను సామాన్యమైన హరిజన వాడలో పుట్టి కాంగ్రెస్ జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చిన వాడినని తెలిపారు. ‘నేను మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన. నేను డబ్బున్నోడిని కాదు.. నా తండ్రి కేంద్ర మంత్రి కాదు.. పొన్నం ప్రభాకర్ మాదిరిగా ఉద్రేకంగా మాట్లాడే శక్తి ఉన్నవాడిని కాదు. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని. వాళ్లు అలా మాట్లాడుతారని నేను కలలో కూడా ఊహించలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నన్ను తిట్టినా పర్వాలేదు.. నా జాతిని తిట్టారు
‘మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా నన్ను తిట్టినా పర్వలేదు.. కానీ నా జాతిని తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. నేను మాదిగను కాబట్టే.. నాకు మంత్రి పదవి ఇచ్చారు. మాదిగ కోటాలోనే మంత్రి ఇచ్చారు. మంత్రిగా నన్ను తిట్టడమంటే మాదిగ జాతిని తిట్టడమే’నని అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియా, రాహుల్‌కు ఫిర్యాదు చేస్తా
మంత్రి పొన్నం ప్రభాకర్ తనను అవమానించిన అంశంపై జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అవసరమైతే అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలుస్తానని చెప్పారు.
నేను ఆలస్యంగా రాలే..
‘మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నట్టు నేను సమావేశానికి ఆలస్యంగా రాలేదు. వాస్తవానికి వక్ఫ్‌బోర్డు చైర్మన్ అహ్మద్ ఫోన్ చేసి వక్ఫ్‌బోర్డుకు సంబంధించి 2500 గజాలకు సంబంధించి ఉత్తర్వులివ్వాలని మాట్లాడుకున్నాం.. ఇందుకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేస్తామని అహ్మద్ చెప్తే సరేనన్న. అవసరమైన వాళ్లను ఆహ్వానించాలని చెప్పిన. నేను మధ్యాహ్నం 3.30కు వస్తానని చెప్పిన. మధ్యాహ్నం 3.05 గంటలకు మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి బయల్దేరే సమయంలో ఎస్కార్ట్ భోజనం చేయలేదంటే కొంతసేపు ఆగిన. ఫహీమ్ ఫోన్ చేస్తే 3.15కి బయలుదేరుతున్నా అని చెప్పిన. మళ్లీ అహ్మద్ ఫోన్ చేసి.. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వచ్చారు.. వాళ్లు అర్జంట్ ఉన్నదని అంటున్నారని చెప్పారు. మీటింగ్ జరగనివ్వండి.. నేను వచ్చి చేరుతా.. ఎలాగూ వాళ్లు ఆగరని నాకు తెలుసు.. కానివ్వండి అని చెప్పిన. ఆ తర్వాత నేను సరిగ్గా మధ్యాహ్నం 3.40 గంటలకు అక్కడికి చేరుకున్న’ అని అడ్లూరి వివరించారు.