హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల ప్రారంభించిన మైనింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్) విభాగాల్లో ప్రవేశపెట్టిన యూజీ, పీజీ కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి లభించింది. ఈ మేరకు ఏఐసీటీఈ నుంచి కళాశాలకు ఉత్తర్వులు పంపించారు. ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆరు డిగ్రీ కోర్సులు, 18 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల అనుమతుల పొడగింపునకు కూడా ఆమోదముద్ర వేసింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైనింగ్ ఇంజినీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్ ఇంజినీరింగ్ లలో యూజీ కోర్సుతో పాటు, పీజీ ప్రోగ్రామ్ ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు తమకు ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఈ గుర్తింపులో అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల పాత్ర కీలకమని, వారందరకీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈసీఈ విభాగంలో యూజీ కోర్సులో విద్యార్థుల సంఖ్యను 50 నుంచి 60 కి పెంచుకునేందుకు సైతం అనుమతి లభించిందని పేర్కొన్నారు. నూతన ఎంఈ కోర్సుకు గుర్తింపు, ఆమోదం లభించినందున గేట్ అర్హత కలిగిన విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్షిప్ వచ్చేందుకు మార్గం సుగమమైందన్నారు.