యాదాద్రిభువనగిరి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రపంచం అబ్బురపడే అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం.. ఔరా అనిపించే శిల్పకళా సౌందర్యం.. సాక్షాత్తు భూలోక వైకుంఠం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.. దీని రూపకర్త, నిర్మాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. భక్తులకు ఆధ్యాత్మిక వైభవమే కాకుండా ఆహ్లాదభరిత కట్టడాలకు కూడా శ్రీకారంచుట్టారు. యాదగిరిగుట్ట పరిధిలో కేసీఆర్ హయాంలోనే నిర్మించిన మినీ శిల్పారామం మరో మణిహారంగా మారనున్నది. రాయగిరి చెరువు వద్ద రెండు ఎకరాల్లో రూ. 2 కోట్ల వ్యయంతో మినీ శిల్పారామం ఏర్పాటుచేశారు. భక్తులు సేదతీరేలా పార్కులు, గ్రీనరీ, చిన్న పిల్లల ఆటల ప్రాంగణం, కుటీరాల సదుపాయం కల్పించారు.
వాటర్ బెడ్స్, ఫౌంటెయిన్లు, బోటింగ్, వ్యూపాయింట్, ఫుడ్‌కోర్టు, లాన్ తదితర వసతులు కనువిందు చేస్తున్నాయి. రాత్రి వేళ లైటింగ్ ఏర్పాటు చేశారు. చేనేత, హస్తకళల స్టాళ్లు, సాండ్ స్టోన్ శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని కేసీఆర్ కట్టించడంతో వెంటనే ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రాలేదు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఏడాదిన్నర తర్వాత ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు.