Anganwadi Teachers | ఖైరతాబాద్, మే 17: వేతనాలు పెంచినట్టే పెంచి పాత జీతాలు చెల్లిస్తూ తెలంగాణ సర్కారు తమను మోసం చేసిందని మినీ అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం 3,989 మినీ అంగన్వాడీ టీచర్లను అప్‌గ్రేడ్ చేసిందని, వేతనాలు పెంచే క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తుచేశారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన అంగన్వాడీలతో సమానంగా పనిచేస్తున్న తమను గుర్తించకపోగా, హెల్పర్లకు ఇచ్చే రూ.7,800 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని వాపోయారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సీతక్క 3,989 మినీ అంగన్వాడీ టీచర్లను అప్‌గ్రేడ్ చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేశారని, హెల్పర్లను కూడా నియమిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
2024 జనవరి నుంచి మూడు నెలలపాటు పెరిగిన వేతనం రూ.13,600 చెల్లించి, ఆ తర్వాతి నెల నుంచి ఇవ్వడం మానివేశారని వాపోయారు. మంత్రి హోదాలో సీతక్క చేసిన తొలి సంతకానికి విలువలేదా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం 12 నెలల వేతనం పెండింగ్‌లో ఉన్నదని తెలిపారు. మంత్రులు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పెంపుదల చేసిన దాని ప్రకారం 12 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని, హెల్పర్లను నియమించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 5వ తేదీలోపే వేతనాలు అందించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రేణుక, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.