ఖైరతాబాద్, జనవరి 31 : పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం మండలం సీతమ్మలొద్దిలో లక్షలాది ఏండ్ల నాటి విలువైన అవశేషాలు, రాతిచిత్రాలను గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బృందం గౌరవ సలహాదారులు, రాతిచిత్రాల నిపుణులు డాక్టర్ బండి మురళీధర్‌రెడ్డి, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మీడియాతో మాట్లాడుతూ… గట్టుసింగారానికి ఆనుకొని ఉన్న దట్టమైన అడవిలో 50 అడుగుల ఎత్తు, వెయ్యి అడుగుల పొడవున్న పడిగెరాయి, ఇసుకరాతి గుహ, 200 అడుగుల పొడవున్న ఆరు పడిగెరాయి కప్పులతో కూడిన గుహలను, రాతిచిత్రాలు, రాతియుగం నాటి పరికరాలను గుర్తించామని తెలిపారు.
మధ్యరాతియుగం (ప్రస్తుతానికి 12వేల ఏండ్లు) నుంచి క్త్రీసుశకం (1 నుంచి 6వ శతాబ్దం)కు చెందిన ఈ రాతిచిత్రాలు ఎరుపురంగు, తెలుపు, పసుపురంగుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. రాతిచిత్రాలపై స్త్రీ, పురుషులు ఆహార్యములు, జింకల తొక్కుడు గీతలు కనిపించాయని తెలిపారు. చరిత్రలోనే తొలిసారిగా ఐదు శాతవాహనకాలపు శాసనాలు, ఒక విష్ణుకుండినుల కాలం నాటి శాసనాలు లభించాయని, ఇవి తెలంగాణ చరిత్రను తిరగరాసే ఆధారాలని వివరించారు.