చిక్కడపల్లి/ఖైరతాబాద్, అక్టోబర్ 23: హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ నిర్మించిన గోడను దళిత సంఘాల నాయకులు మంగళవారం అర్ధరాత్రి దాటాక కూల్చివేశారు. అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ సమితి నాయకుడు వినోద్‌కుమార్, ఇతర దళిత నాయకులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చొని వారు నిరసన వ్యక్తంచేశారు. రాజ్యంగ నిర్మాతకు జరిగిన అవమానంగా భావించి దానిని కూల్చివేశామని వారు ఈ సందర్భంగా తెలిపారు. అంబేద్కర్‌ను ఏ రూపంలో అవమానించినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ విషయం తెలిసిన సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దళిత సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. బుధవారం మలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, ఇతర దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ సంజయ్‌కుమార్, సీఐలు దళిత సంఘల నేతులను సముదాయించారు.