Police Medals | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీస్ విభాగాల్లో దేశవ్యాప్తంగా 1,132 మంది సిబ్బందికి గ్యాలెంట్రీ/సర్వీస్ మెడల్స్‌ను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ర్టానికి 22 సేవా పతకాలు లభించాయి. వీటిలో ఆరు గ్యాలెంటరీ మెడల్స్, రెండు రాష్ట్రపతి పతకాలు, 12 ఉత్తమ ప్రతిభా పతకాలు, రెండు కరెక్షనల్ సర్వీసెస్ మెడల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఆయా శాఖలకు రాష్ట్రపతి ఆఫీసు నుంచి సర్టిఫికెట్లు వచ్చాయి. వాటిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా విభాగాధిపతులు అందించనున్నారు. డీజీపీ ఆఫీసుకు వచ్చే మెడల్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అందుకోనున్నారు.
సీనియర్ పోలీస్ అధికారి, పౌర సరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు ఒకేరోజు రెండు అత్యుత్తమ అవార్డులు లభించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే రాష్ట్రపతి విశిష్టసేవా పతకానికి డీఎస్ చౌహాన్ ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు (2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా 2023 శాసనసభ ఎన్నికలను సజావుగా, సమర్థంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును గురువారం జేఎన్టీయూలో నిర్వహించిన ఓటర్స్ డే సెలబ్రేషన్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నుంచి అందుకున్నారు. ఒకే రోజు రెండు అవార్డులు రావడం పట్ల పౌరసరఫరాలశాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): వివిధ రంగాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 31 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డ్స్‌ను అందించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డుకు ఖమ్మం జిల్లాకు చెందిన పోలీస్ డ్రైవర్ (ఎస్సై) డీ నవీన్‌కుమార్ ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా చీమలపాడులో సంభవించిన గ్యాస్ పేలుడులో ఎడమకాలు కోల్పోయి.. 40 మందిని అగ్నిప్రమాదం నుంచి కాపాడారు.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ):1984 నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు విశేష సేవలందించిన ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) బావిశెట్టి చంద్రశేఖర్‌కు పరమ విశిష్ట సేవా పతకం వరించింది. తెలంగాణలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ సెంటర్‌కు కమాండెంట్‌గా విశేష సేవలందించిన చంద్రశేఖర్ గత నవంబర్‌లో పదవీ విరమణ పొందారు. 1984 డిసెంబర్ 21న హెలికాప్టర్ పైలట్‌గా భారత వైమానిక దళం ఫ్లయింగ్ బ్రాంచ్‌లో నియమితులయ్యారు. నాటి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఐఏఎఫ్ ఇన్వెంటరీలో ఎన్నో రకాల హెలికాప్టర్లను 5,400 గంటలకు నడిపిన అనుభవం ఆయనది. 2008లో చంద్రశేఖర్ సేవలను చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ప్రశంసించింది. 2020లో భారత రాష్ట్రపతి అతి విశిష్ట సేవా పతకాన్ని (ఏవీఎస్ఎం) అందుకున్నారు. ఇప్పుడు పరమ విశిష్ట సేవా పతకం (పీవీఎస్ఎం) రావడం పట్ల ఆనందంగా ఉన్నదని, తన సేవలను భారత వైమానిక దళం గుర్తించిందని చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.