హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది. ఛత్తీస్‌గఢ్‌లోని మధ్య భాగాల నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పడుతాయని తెలిపింది. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరిక చేసింది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసినట్టు తెలిపింది. సాయం త్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాబోయే 48 గంటలు ఆకాశం మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సీయస్ నమోదయ్యే అవకాశాలున్నట్టు తెలిపింది.
ఏప్రిల్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది. సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాయంత్రం వాతావరణం చల్లబడి పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడుతున్నాయని తెలిపింది. బుధవారం ఆదిలాబాద్‌లో 39.8, నిజామాబాద్ 39.1, మహబూబ్‌నగర్ 39, మెదక్ 38.4, రామగుండం 38, భద్రాచలం 37.8, ఖమ్మం 37.6, నల్లగొండ 37, హనుమకొండ 37, హైదరాబాద్ 36.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయినట్టు ప్రకటించింది.