జగిత్యాల, జూన్ 9: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి (వైఎల్‌ఎన్‌ఎస్) కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును జగిత్యాలలోని గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్టు ఆ బ్యాంకు సీఈవో వనమాల శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 10నుంచే అమల్లోకి వస్తుందని, ఇక నుంచి వైఎల్‌ఎన్‌ఎస్ బ్యాంకు 6 బ్రాంచీలు గాయత్రీ బ్యాంక్ బ్రాంచీలుగా పని చేస్తాయని వివరించారు.
గాయత్రీ బ్యాంక్ 39 బ్రాంచీలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో సేవలందిస్తున్నదని, వైఎల్‌ఎన్‌ఎస్ బ్యాంకు విలీనంతో 45 బ్రాంచీలకు చేరుకుంటుందని చెప్పారు. విలీనం తర్వాత రూ.1,635.86 కోట్ల డిపాజిట్స్, రూ.1,177.82 కోట్ల రుణాలతో రూ.2,813.68 కోట్ల వ్యాపారానికి చేరుకున్నట్టు తెలిపారు. గాయత్రీ బ్యాంక్ 7.49 లక్షల కస్టమర్ బేస్‌తో దక్షిణాదిలోనే అగ్రస్థానంలో ఉన్నదని, వైఎల్‌ఎన్‌ఎస్ బ్యాంక్ 23 వేల ఖాతాదారులను కలిగి ఉన్నదని వివరించారు.