హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షల్లో తుది అంకమైన ఇంటర్వ్యూ దశ దాటాలంటే అభ్యర్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఇక దేశంలోనే అత్యున్నత పరీక్షల్లో ఒక్కటైన సివిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూను అధిగమించడం గొప్ప విషయమే. ఎక్కడ తడబడినా.. మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిందే. అయితే ఇంటర్వ్యూ దశకు చేరుకున్న ఎందరో అభ్యర్థులకు మెంటార్‌గా అండగా నిలుస్తున్నారు రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీ మహేశ్ భాగవత్. ఇప్పటివరకు 2వేల మంది సివిల్స్ అభ్యర్థులకు ఆయన శిక్షణ ఇచ్చారు. తాజా ఫలితాల్లో టాప్-100లో 16 మంది, మొత్తం 1016లో 200 మంది తన దగ్గరే ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇందులో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ అనన్యరెడ్డి, 100వ ర్యాంకర్ హోస్మాని కూడా ఉన్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్ కుమారుడు సందీప్‌కుమార్ 830వ ర్యాంక్ సాధించాడు. 2015 నుంచి అభ్యర్థులకు తర్ఫీదునిస్తున్నారు. మరికొంత మందినీ సివిల్స్ వైపు నడిపించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.