హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఎడ్‌సెట్‌లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే దక్కించుకున్నారు. టాప్ -10 ర్యాంకులు ప్రకటించగా, మొత్తం ర్యాంకులు అబ్బాయిలే దక్కించుకోవడం గమనార్హం. ప్రతిసారి అమ్మాయిల హవా సాగుతుండగా, ఈసారి మొత్తం ర్యాంకులు అబ్బాయిలే కైవసం చేసుకున్నారు.
ఈసారి 96.95% ఉత్తీర్ణత నమోదయ్యింది. ర్యాంకర్ల పరంగానే కాకుండా, ఫలితాల్లోనూ అబ్బాయిలే సత్తాచాటారు. అబ్బాయిలు 98.85% క్వాలిపై కాగా, అమ్మాయిలు 96.57% క్వాలిఫై అయ్యారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ర్యాంకర్ల వివరాలు మీడియాకు వెల్లడించారు.
