Indiramma Indlu | అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 23 : ‘మా గ్రామానికి కేవలం నాలుగు ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. ఇస్తే 60 ఇండ్లు ఇయ్యండి.. లేదంటే ఈ నాలుగు కూడా రద్దు చేయండి’ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు.
అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నగూడెం ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్థులు అశ్వారావుపేట-రామన్నగూడెం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గ్రామంలో 200 కుటుంబాలు ఉండగా.. 60 మందికి ఇండ్లు లేవని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వం కేవలం నాలుగు ఇండ్లు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఇందిరమ్మ కమిటీ ముందుగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించింది. మంజూరైన నాలుగు ఇండ్లను కూడా రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించినట్టు కమిటీ సభ్యులు కోర్స ప్రసాద్, రాచకొండ బంగారం, కే ఉదయ్‌కుమార్, నారం కుమారి తెలిపారు.