హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘వచ్చారు.. తిట్టారు.. వెళ్లారు..’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన తీరు ఇది. శనివారం సైతం ఇదే తంతు పాటించారు. బేగంపేటలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రధాని చేసిన ప్రసంగంలో ఆద్యంతం సీఎం కేసీఆర్‌పై అక్కసు కనిపించింది. అవినీతి, కుటుంబ పాలన, మూఢ నమ్మకాలు అంటూ ప్రధాని చేసిన రొడ్డకొట్టుడు వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకే బోర్ కొట్టించాయి. కింద పడ్డా నాదే పైచేయి అన్నట్టు.. మోదీ మునుగోడు ప్రజలు తమను నమ్మారంటూ గెలిచినంత బిల్డప్ ఇచ్చారు. మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తన పరువు పోతున్నదని, ఇన్నాళ్లూ పారదర్శక పాలన, అవినీతిరహితం అంటూ చేసిన ప్రచారం డొల్ల అని ప్రజలకు తెలిసిపోతుందనే భయం మోదీలో స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు చెప్తున్నారు.
మోదీ: ఐటీకి హైదరాబాద్ కోట లాంటిది
మరి.. ఐటీ కోటకు మంజూరైన ‘ఐటీఐఆర్’ ప్రాజెక్టును మోదీ సర్కారు ఎందుకు రద్దు చేసినట్టు. కేంద్రం సహకారం లేకున్నా ఐటీలో తెలంగాణ సొంతంగా ఎదిగింది. 2013-14లో ఐటీ రంగం ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉంటే.. 2021-22 నాటికి ఏకంగా రూ.1.83 లక్షల కోట్లకు పెరిగింది.
మోదీ: మూఢనమ్మకాల పాలన నడుస్తున్నది.
భారతీయ సంప్రదాయంలో విశ్వాసాలకు, మూఢనమ్మకాలకు మధ్య తేడా ఉన్నది. రాఫెల్ యుద్ధ విమానాలు దేశానికి వచ్చే ముందు ఫ్రాన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వాటికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి, బొట్టు పెట్టి పూజ చేశారు. అది విశ్వాసమా? మూఢనమ్మకమా? మోదీ చెప్పాలి.
మోదీ: పేదలను దోచేవారిని వదిలిపెట్టను
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మూడింతలు చేసి పేదలను దోచుకుంటున్నది ఎవరు? డీజిల్‌పై 512 శాతం, పెట్రోల్‌పై 194 శాతం పన్ను పెంచింది కేంద్రం కాదా? రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200కు పెంచి వంటింట్లో కుంపటి పెట్టిందెవరు? సబ్సిడీలన్నీ ఎత్తేసింది బీజేపీ ప్రభుత్వం కాదా?. ఇదంతా పేదలను దోచుకోవడం కాదా?
మోదీ: అవినీతి, కుటుంబపాలన అభివృద్ధికి శత్రువులు
మోదీ క్యాబినెట్‌లోని అనురాగ్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధుమాల్ కొడుకు), ధర్మేంద్ర ప్రధాన్ (మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కొడుకు), జ్యోతిరాదిత్య సింధియా (విజయరాజె సింధియా మనుమడు), కిరణ్ రిజిజు (అరుణాచల్ ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే రిన్చిన్ ఖరూ కొడుకు) వారసత్వ రాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణలు. బీజేపీలో చాంతాడంత జాబితా ఉన్నది.
మోదీ: బీజేపీ ప్రభుత్వాలదే ట్రెండ్
బీజేపీ ఇప్పటివరకు 8 రాష్ర్టాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసింది. కోట్ల మంది ప్రజలను అవమానించింది. తెలంగాణలోనూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. తెలంగాణతోపాటు ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ తమ టార్గెట్‌లో ఉన్నాయని ఫాంహౌస్ కేసులోని నిందితులు చెప్పారు.
మోదీ: జంగారెడ్డి బీజేపీకి ప్రాణం పోశారు
తన స్వార్థం కోసం జంగారెడ్డి పేరును తలిచారు మోదీ. ‘నాకు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వాలని మోదీని రెండుసార్లు కలిశాను. అమిత్‌షాతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ, కనీసం నాతో మాట్లాడలేదు..’ అని 2018లో జంగారెడ్డే మీడియా ముందు వాపోయారు. దీనిని బట్టే మోదీ, షా కలిసి జంగారెడ్డికి చేసిన అవమానం అర్థమవుతున్నది.
మోదీ: రెండు కిలోల తిట్లు తిన్నాను
మోదీ నాలుగైదేండ్లుగా ఇదే ముచ్చట చెప్తున్నారు. 2018 ఆగస్టులో లండన్‌లో జరిగిన కార్యక్రమంలో అచ్చం ఇవే మాటలు చెప్పారు. వాస్తవానికి మోదీకి ఇతరులను తిట్టడం బాగా అలవాటు. ఆయన నోటికి జడిసే నేతలు ఎందరో. రోజంతా ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూనే ఉండే మోదీ.. సానుభూతి కోసం పాకులాడుతున్నారు.
మోదీ: నానో యూరియా టెక్నాలజీ తెచ్చాం
నానో యూరియా (ద్రవ రూపంలో)ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇఫ్కో అనే ప్రైవేటు ఎరువుల కంపెనీ. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు.
మోదీ: పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో వేస్తున్నాం
ఈ పథకం కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధును కాపీ కొట్టిందే. రైతులకు యేటా రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున అందజేస్తున్నది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి.
మోదీ:రేషన్ బియ్యం పంపిణీ చేశాం
కరోనా సమయంలో కేంద్రం కన్నా ముందే పేదల ఆకలి తీర్చేందుకు ఉచిత బియ్యం ఇచ్చింది తెలంగాణ సీఎం కేసీఆర్. ఆ తర్వాతే కేంద్రం ప్రారంభించింది. దాదాపు రెండేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు కేంద్రం తో సంబంధం లేకుండా రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది.
మోదీ: యూరియాను సబ్సిడీపై ఇస్తున్నాం
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎరువుల ధరలు క్రమంగా పెరిగాయి. 2014-15లో ఎంవోపీ ధర రూ.840 ఉంటే ఇప్పుడు రూ.1700లకు పెరిగింది. కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.890-1210 ఉంటే ఇప్పుడు రూ.1250-1395కి పెరిగింది. ఎరువుల ధరలు పెంచుతూ యూరియాను సబ్సిడీపై అందిస్తున్నామంటూ రైతులను మోసగిస్తున్నది బీజేపీ సర్కారు కాదా?
మోదీ: పసుపు రైతులకు రాష్ట్రం అన్యాయం?
ఎన్నికైన ఐదురోజుల్లో పసుపు బోర్డు ప్రకటన చేయిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్‌ది బీజేపీయే. మాట దాటేసింది బీజేపీ ఎంపీ కాదా? ఇప్పటి వరకు పసుపు బోర్డు ఏర్పాటుచేయకుండా వివక్ష ప్రదర్శిస్తున్నది కేంద్రమే కదా.
మోదీ: వాళ్లే ముందుకుపోయారు.. తెలంగాణ వెనుకబడింది?
అభివృద్ధిలో తెలంగాణ వెనకబడితే కేంద్రం అనేక రంగాల్లో పిలిచి మరీ అవార్డులు ఎందుకు ఇస్తున్నది. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దేశ తలసరి ఆదాయం కంటే, రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువ. సీఎం కేసీఆర్ పాలన నచ్చటంతోనే ప్రజలు రెండుసార్లు ఆశీర్వదించి పట్టంకట్టారు.
మోదీ: గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడదేమీ లేదు.
ప్రపంచంలో ఎరువులను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ది మూడో స్థానం. ఏడాదికి 25 లక్షల టన్నుల అమ్మోనియా, డీఏపీ, ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకోవడానికి గత ఆగస్టులోనే సౌదీ అరేబియాతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకొన్నది. మూడేండ్లపాటు ఈ ఒప్పందం కొనసాగనున్నది.
మోదీ:తెలంగాణలో రైతులు సంతోషంగా లేరు..
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. తద్వారా తెలంగాణలో వ్యవసాయం సుభిక్షమైంది. 2014-15లో రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం 24 లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం 2 కోట్ల టన్నులకు పెరిగింది. మరి తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నట్టా లేన్నట్టా?
మోదీ: తెలంగాణ ప్రజలకు నష్టం కలిగిస్తే ఊరుకోను.
తెలంగాణ పుట్టుకే ఆయనకు నచ్చదు. ‘తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. సీమాంధ్రను కాంగ్రెస్ అనాథగా మార్చివేసింది. పార్లమెంట్ తలుపులు మూసి ఏపీని విభజించారు’ అని అనేక వేదికలపై అక్కసు వెల్లగక్కారు. ఇప్పుడు తెలంగాణ ఎంతో ఇష్టం అంటూ.. కపట ప్రేమ ప్రదర్శించారు.
మోదీ: మునుగోడు ప్రజలు బీజేపీపై భరోసా ఉంచారు.
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 10వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. అంటే ప్రజలు ఎవరిమీద భరోసా ఉంచినట్టు! మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు. గుజరాత్ ఎన్నికల కోసం కేంద్ర మంత్రులంతా అక్కడే మకాం వేశారు. మరి దీనినేం అంటారు మోదీ?
మోదీ: అవినీతిని బీజేపీ సహించదు.
శ్రీలంకలోని ఓ విద్యుత్తు ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కు అప్పగించేలా ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై మోదీ ఒత్తిడి తెచ్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఫెర్డినాండో చెప్పింది నిజం కాదా?బీజేపీ పాలిత కర్ణాటకలో 40 శాతం లంచం ఇచ్చుకోలేక ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నది అబద్ధమా?