Kodangal Lift | హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకున్నది. ప్రాజెక్టులోని ఒక ప్యాకేజీ పనులను మేఘా కంపెనీకి, మరో ప్యాకేజీ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రక్తసంబంధీకులకు చెందిన రాఘవ కంపెనీకి ప్రాథమికంగా కట్టబెట్టారు. ఈ పనులను ఈ సంస్థలకే అప్పగించనున్నారనే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ప్రచురించింది. అదే ఇప్పుడు నిజమైంది. టెండర్‌కు ముందే ఇరు కంపెనీలు కూడబలుక్కున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఆయా కంపెనీలు దాఖలు చేసిన కొటేషన్లే నిదర్శనమని చెప్తున్నారు. మరోవైపు, టెక్నికల్ ఎవాల్యూయేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించలేదనే ఆరోపణలొస్తున్నాయి.
మేఘా, రాఘవ కంపెనీలకు చెరో ప్యాకేజీ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని రూ.లక్ష ఎకరాలకు సాగునీటితోపాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు ఎన్‌కేఎల్‌ఐఎస్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తంగా రెండు ప్యాకేజీలుగా లిఫ్ట్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో పంచ్దేవ్పహాడ్, భూత్పూర్ పంపింగ్స్టేషన్ల నిర్మాణం, ఊట్కూరు, జయమ్మ, కానుకుర్తి తదితర చెరువుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందుకు రూ.1,134.62 కోట్లు అవసరమని అంచనా వేశారు. రెండో ప్యాకేజీలో ఊట్కూరు, కానుకుర్తి పంపింగ్స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు 1,126.23 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా పంపింగ్ సిస్టమ్ కోసమే 2,260.85 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇవికాక రెండో దశలో జాజాపూర్, దౌలతాబాద్, బొమ్రాస్పేట, లక్ష్మీపూర్, ఎర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం, రూ.3 వేల ఎకరాల భూసేకరణ తదితర పనులకు మరో రూ.1,404.50 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. ఇటీవల ఈ రెండు ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఇరిగేషన్ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇటీవలనే టెండర్లను తెరిచారు. ఇందులో మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ, రెండో ప్యాకేజీ పనులను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకున్నాయి. ఆయా పనుల అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేయడం గమనార్హం.
టెక్నికల్ ఎవాల్యూయేషన్పై ఆరోపణలు
ఎన్‌కేఎల్‌ఐఎస్ ప్యాకేజీ పనుల అప్పగింతకు నిర్వహించిన టెండర్ల పక్రియపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేఘా, రాఘవ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టేందుకే టెక్నికల్ ఎవాల్యూయేషన్‌ను సరిగా నిర్వహించలేదని, కావాలనే మరో రెండు కంపెనీలను తప్పించారనే ఆరోపణలున్నాయి. ఈ పనుల కోసం ఎల్అండ్టీ, ఎన్సీసీ (నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ) సైతం బిడ్లను దాఖలను చేశాయి. వారం రోజుల క్రితం తొలుత టెక్నికల్ బిడ్లను తెరిచారు. అందులో నాలుగు కంపెనీలూ అర్హతను సాధించాయి. దీంతో ప్రైస్ బిడ్లను తాజాగా తెరిచారు. ఇందులో మేఘా, రాఘవ కంపెనీలే అర్హత సాధించాయి. మిగిలిన రెండు కంపెనీలు అర్హతను సాధించలేదని అధికారులు చెప్తున్నారు. సాధారణంగా టెక్నికల్ ఎవాల్యూయేషన్ చేసేటప్పుడు ఆయా కంపెనీల ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు. గతంలో కంపెనీ చేపట్టిన నిర్మాణాలు, అందులో వైఫల్యాలు, ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఆ నిబంధనలను సక్రమంగా అమలు చేసి ఉంటే మేఘా కంపెనీకి టెక్నికల్‌గా అర్హత సాధించే వీలే ఉండదని, ప్రాథమికంగానే తిరస్కరించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. మేఘా కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో ఇటీవల టన్నెల్ గేట్ ధ్వంసం కావడంతోపాటు రిజర్వాయర్ వైపు ఉన్న సైడ్‌వాల్ (రక్షణ గోడ) కూలిపోయింది. దీంతో సంపు, పంప్‌హౌజ్ సూపర్‌స్ట్రక్చర్ నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. వాటర్‌బోర్డు జారీచేసిన షోకాజ్ నోటీసులకు ఈ మేరకు మేఘా కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఎన్‌కేఎల్‌ఐఎస్ టెండర్ల ఖరారులో సుంకిశాల ప్రమాద ఘటనను పరిగణనలోకి తీసుకోలేదని, మేఘా కంపెనీకి కట్టబెట్టేందుకు టెక్నికల్ ఎవాల్యూయేషన్ నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలున్నాయి.
ముందే చెప్పిన ‘నమస్తే తెలంగాణ’
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్) పనులు మేఘా కంపెనీకే దక్కనున్నాయని, అందుకు అనుగుణంగా ముందస్తుగానే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని ‘నమస్తే తెలంగాణ’ ఆది నుంచీ చెప్తున్నది. ఇదే విషయమై ఆగస్టు 18న ‘మేఘా చేతికే కొడంగల్ ’పేరిట ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఒక ప్యాకేజీ పనులను ఆ కంపెనీయే దక్కించుకోవడం గమనార్హం. ఎన్కేఎల్ఐఎస్కు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అందులో అప్పుడున్న భూగర్భ సొరంగాల స్థానంలో ఇప్పుడు ప్రెషర్మెయిన్స్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మేఘా కంపెనీకి ప్రాజెక్టు పనులను అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇరిగేషన్‌శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి సొరంగాల ద్వారా తరలించాల్సి ఉంటుంది.
ఇందుకు దాదాపు 38 కిలోమీటర్ల పొడవు సొరంగాలను తవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలకు బదులుగా ప్రెషర్మెయిన్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూసేకరణ, జియోలజికల్ అధ్యయనాలు, సొరంగాలకు అడ్డుగా ఉండే రాళ్లు, బండల కటింగ్‌కు ఎకువ సమయం పడుతుందని, రైతులకు సాగునీటిని సత్వరమే అందించేందుకు ప్రెషర్‌మెయిన్ నిర్మించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం చెప్తున్నది. ప్రభుత్వ వాదన వట్టిదేనని ఇంజినీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ప్రెషర్మెయిన్స్తో ప్రాజెక్టును చేపట్టినా దాదాపు మూడేండ్ల సమయం పడుతుందని ఇంజినీర్లు వివరిస్తున్నారు. మోటర్లు రావడానికి, పంప్‌హౌజ్‌ల నిర్మాణం, మోటర్ల బిగింపునకు దాదాపు రెండున్నరేండ్లు పడుతుందని, ఆ సమయంలో ఇప్పుడున్న సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా భూగర్భ సొరంగాల తవ్వకాన్ని పూర్తి చేయొచ్చని వివరిస్తున్నారు. సొరంగాల నిర్మాణం చేపడితే దీర్ఘకాలంపాటు మెయింటనెన్స్ ఉండబోదని, కానీ ప్రెషర్స్మెయిన్స్తో అదనంగా మెయింటనెన్స్ భారం పడుతుందని వెల్లడిస్తున్నారు. సొరంగాల ద్వారా పంపింగ్ సిస్టమ్‌ను పూర్తిచేయడానికి రూ.963.898 కోట్లు అవసరమవుతాయని, ప్రెషర్మెయిన్స్ ద్వారా ఆ ఖర్చు 1,016.572 కోట్లుకు పెరుగుతుందని తెలిపారు. మొత్తంగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా లిఫ్ట్‌ను చేపడితే ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.60 కోట్లు అదనంగా పెరగనున్నది. ఏటా మెయింటెనెన్స్ చార్జీలు అదనపు భారం కానున్నాయి.
ముందే కూడబలుక్కున్నారా?
ఎన్‌కేఎల్‌ఐఎస్ ప్యాకేజీ పనులను దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్, మేఘా కంపెనీలు ముందే కూడబలుక్కుని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.1,134.62 కోట్లతో చేపట్టాల్సిన ప్యాకేజీ-1 పనులకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేసింది. అదే పనులకు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ 4.85% అధికంగా కోట్ చేసింది. దీంతో ఎల్1గా నిలిచిన రాఘవ కంపెనీకి ప్యాకేజీ-1 టెండర్ దక్కింది. రూ.1,126.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ-2 పనులకు మేఘా ఇంజినీరింగ్ 3.95% అధికంగా కోట్ చేయగా, రాఘవ కంపెనీ 4.8% అధికంగా కోట్ చేసింది. దీంతో ఎల్-1గా నిలిచిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ప్యాకేజీ-2 టెండర్ దకింది. మేఘా కంపెనీ అధికంగా కోట్ చేసిన చోట రాఘవ కంపనీ తక్కువగా కొటేషన్ దాఖలు చేయడం, మేఘా కంపెనీ తక్కువ కోట్ చేసిన చోట రాఘవ కంపెనీ అధికంగా కొటేషన్ దాఖలు చేయడం లోపాయకారి ఒప్పందంలో భాగమేనని ఇరిగేషన్ శాఖలో చర్చించుకుంటున్నారు. రూ.1,134.62 కోట్ల విలువైన పనులకు 3.9% అధిక కొటేషన్ దాఖలు చేసిన రాఘవ కంపెనీ, అంతకంటే రూ.1126.85 కోట్ల విలువైన ప్యాకేజీ-2 పనులకు మాత్రం 4.8% అధికంగా కోట్ చేయడం గమనార్హం.
మంత్రి స్వయంగా పట్టుబట్టి..!
ఎన్కేఎల్ఐఎస్కు సంబంధించిన రెండు ప్యాకేజీల పనులను మేఘా కంపెనీకే అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ముందుగా నిర్ణయించినట్టు సమాచారం. ఇరిగేషన్ అధికారులు సైతం అంతా ఇదే అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో రాఘవ కంపెనీ సైతం ఒక ప్యాకేజీ పనులను దక్కించుకున్నది. రాఘవ కంపెనీ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రక్తసంబంధీకులదే. దీంతో మంత్రి పట్టుబట్టి తమవారి కంపెనీకి పనులు దక్కేలా చివరి నిమిషంలో చక్రం తిప్పారని కాంగ్రెస్‌పార్టీ నేతలతోపాటు ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.