హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ను ఆమోదించి మెగా టెక్స్‌టైల్‌పార్కు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్ర జౌళి, ఆర్థికశాఖల మంత్రులను కేటీఆర్ స్వయంగా కలిసి, లేఖల ద్వారా అనేక పర్యాయాలు రాష్ర్టానికి మెగా టెక్స్టైల్ పార్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడంతో కేంద్రం స్పందించిందని శనివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన నేత కార్మికులు రాష్ట్రంలో పని లేక భీవండి, సోలాపూర్, అహ్మదాబాద్, సూరత్ తదితర ప్రాంతాలకు వలసపోయారని, ఇవన్నీ చూసి చలించిపోయిన కేసీఆర్ వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు. దీని కోసం 1,200 ఎకరాల భూమి సేకరించి శంకుస్థాపన చేశారని చెప్పారు.
అంతర్జాతీయంగా పేరుగాంచిన కిటెక్స్ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు చేపట్టారని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వస్త్ర పరిశ్రమలోని ఉపాధి అవకాశాలు చూసి వలస వెళ్లిన నేతన్నలు తిరిగి వస్తున్నారని గుర్తుచేశారు. చేనేత వస్త్రాలపై కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత క్లస్టర్లను మంజూరు చేసి చేనేత కళాకారుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని మంజూరు చేయాలని, రద్దు చేసిన హ్యాండ్లూమ్ బోర్డ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.