Mega Job Mela | కొత్తగూడెం అర్బన్, నవంబర్ 2: కొత్తగూడెం నియోజకవర్గం తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 11 న మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నట్లు కొత్తగూడెం శాసన సభ్యులు కూనoనేని సాంబశివరావు తెలిపారు. ఆదివారం కొత్తగూడెం పట్టణంలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సహకారంతో ఈ నెల 11న కొత్తగూడెం క్లబ్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని , ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలానే సదుద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నానికి అన్నీ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవ సంఘాలు కలిసి రావాలని ఎం ఎల్ ఏ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ తో పాటు ఈత ప్రాంతాలకు చెందిన సుమారు 60కంపెనీలు ఈ జాబ్ మేళా లో పాల్గొంటున్నాయి వివరించారు. ఐ టీ, బ్యాంకింగ్, ఫార్మసీ, బీ పీ ఓ, సర్వీస్ సెక్టార్, మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. జాబ్ మేళా కు హాజరయ్యే అభ్యర్థులు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునేలా, క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెల 6న జిల్లా అధికారులతో, సింగరేణి ఉన్నతాధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు ఎం ఎల్ ఏ పేర్కొన్నారు. సుమారు రెండువేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రతీ ఒక్కరూ ఈ జాబ్ మేళా కు సహకరించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి జనరల్ మేనేజర్ షాలెం రాజు, ఏ జీ ఎం కోటిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, నాయకులు కంచర్ల జమలయ్య, మల్లికార్జున, క్రిస్టోఫర్, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.