హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం, కుర్మల్‌గూడలోని సర్వేనంబర్ 46 ప్రభుత్వ భూమి సహా పలుచోట్ల కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనాలకు ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చింది. రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశాలతో సోమవారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కార్యాలయంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కబ్జాలకు తొలి అడుగుగా అక్రమార్కులు కరెంటు మీటర్ తీసుకుంటున్నారనే చర్చ వచ్చింది. దీంతో సమావేశంలోనే విద్యుత్తుశాఖ అధికారికి ఓ రెవెన్యూ అధికారి ఫోన్ చేయగా పైవిధంగా నిర్లక్ష్యపు సమాధానం వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంభాషణను ఫోన్లో స్పీకర్ పెట్టి అందరూ విని అవాక్కయినట్టు సమాచారం.
అదేవిధంగా మున్సిపల్‌శాఖ నుంచి అక్రమార్కులకు ఇంటి నంబర్ల రూపంలో సహకారం అందుతున్నదనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలన్నింటినీ జిల్లా కలెక్టర్‌కు వి వరించి, కబ్జాల తొలగింపునకు కార్యాచరణ ఎలా అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. కలెక్టర్ ఆదేశాలతో అక్రమార్కులు, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. పోలీస్ బలగాల సహకారంతోనే ఆక్రమణల తొలగింపు సాధ్యం అవుతుందని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌యాదవ్, కందుకూరు ఆర్డీవో సూరజ్‌కుమార్, బాలాపూర్ తహసీల్దార్ మాధవీరెడ్డి, బడంగ్‌పేట, జల్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు సుమన్‌రావు, వసంత, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.