హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి తెరపైకి వచ్చారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మరోసారి యాక్టివ్ అవుతున్న సమయంలో వీరి భేటీ చర్చనీయాంశంగా మారిం ది. సోమవారం రాజమండ్రిలో మాజీ ఎంపీలు జీవీ హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను లగడపాటి కలిశారు.
రాష్ట్ర విభజన నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హర్షకుమార్‌ను కలిసిన సమయంలో ఏపీ రాజకీయాలపై స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని తెలిపారు. రాజమండ్రి వచ్చిన సమయంలో హర్షకుమార్, ఉండవల్లిని కలవడం మామూలేనని వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. 2019లో టీడీపీలో చేరిన హర్షకుమార్ టికెట్ దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా పెద్దగా యాక్టివ్‌గా లేరు.