మహదేవపూర్, డిసెంబర్ 5 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ భూకంపాన్ని తట్టుకొని నిలబడింది. బుధవారం వచ్చిన భూప్రకంపన నేపథ్యంలో బరాజ్ ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. బరాజ్‌లోని ఏడో బ్లాక్‌తోపాటు బరాజ్ అప్, డౌన్ స్టీమ్తోపాటు సాంకేతిక అంశాలపైనా క్షుణ్ణంగా పరిశీలించారు. భూకంపం నేపథ్యంలో బరాజ్‌లో ఎలాంటి మార్పులు సంభవించలేదని, ప్రసుత్తం బరాజ్ సేఫ్‌గానే ఉన్నదని అధికారులు తేల్చారు. 2023 సంవత్సరం వర్షాకాలంలో సుమారు 24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం, 2024లో సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకోవడంతోపాటు ప్రసుత్తం వచ్చిన భూకంపాన్ని తట్టుకొని నిలబడటం గమనార్హం. ఇన్నాళ్లు బరాజ్‌పై అవాస్తవాలు ప్రచారాలు చేసిన వాళ్ల నోళ్లు మూతపడేలా బరాజ్ నిలిచిందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.