రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కుదుపు!
ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వం భారీ మార్పులకు దిగింది. ఇంజినీర్ ఇన్ చీఫ్ (రామగుండం) ఎన్ వెంకటేశ్వర్లును సర్వీస్‌నుంచి తొలగించింది. మరో ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావును రాజీనామా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాగునీటి వివాదాలు చుట్టుముడుతున్నవేళ తనపై పడిన మరకల్ని తుడిపేసుకునేందుకు రేవంత్ సర్కారు అధికారులను బలిపెడుతున్నట్టే ఉన్నది!
ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించనే లేదన్నారు.. ఇరిగేషన్ అధికారులు తప్పేమీ చేయలేదన్నారు.. అంతలోనే ఉన్నతాధికారులపై చర్యలు మొదలయ్యాయి! ప్రభుత్వం తప్పు చేసి నెపాన్ని అధికారుల మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నదా? లేక అధికారులతోనే అన్నీ చేయించి.. వివాదమయ్యాక వారిని వదిలించుకుంటున్నదా? ఇప్పుడు రాష్ట్ర అధికార యంత్రాంగంలో దీనిపైనే వాడీవేడీ చర్చ సాగుతున్నది.
నేటినుంచి అసెంబ్లీ ప్రారంభమవుతున్నది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం సభను కుదిపేయనున్నది. ఈ దశలో నీటిపారుదలశాఖకు సంబంధించిన తాజా పరిణామాలు కీలకంగా మారాయి. అధికారులపై చర్యలతో ప్రాజెక్టుల అప్పగింతలో తప్పు జరిగిందని రేవంత్ సర్కారు పరోక్షంగా అంగీకరించినట్టయ్యింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వ నిర్ణయాలనే అధికారాలు అమలు చేస్తరు. నిర్ణయాలు చేయటం ప్రభుత్వం బాధ్యత. అమలు చేసేది అధికారుల బాధ్యత. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడమే అధికారుల పని. వారి సొంత నిర్ణయాలు అమలు చేయడం కుదరదు’. ఇదీ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన మాట. గత నెల 17న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి సమావేశం, ఈ నెల ఒకటో తేదీన జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం.. ఈ రెండింటిలోనూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మురళీధర్‌రావు ‘కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు అంగీకారమే’ అని స్పష్టం చేశారు. అంటే రేవంత్ సర్కారు ఏం చెప్పిందో ఈఎన్సీ మురళీధర్‌రావు తు.చ. తప్పకుండా అదే చేశారనేది నిర్వివాదాంశం. కాకపోతే ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా నడిపించారనే ప్రచారం ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో జోరందుకున్నది. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమాచారం లేకుండానే ‘ప్రాజెక్టుల అప్పగింత’ తతంగం జరిగిపోయిందనే వాదన వినిపిస్తున్నది. ఇందుకు గత నెల రోజుల్లో చోటుచేసుకున్న అనేక పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. సర్కారు వైఫల్యాన్ని గుర్తించి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైందో అప్పుడు సీఎం రేవంత్ ‘తూచ్’ అంటూ మీడియా సమావేశం నిర్వహించినట్టు చెప్తున్నారు.
కేంద్ర జల్‌శక్తి శాఖ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని గత నెల 17వ తేదీన నిర్వహించింది. అందులో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వం (అధికారులు) అంగీకరించిందనే వాస్తవాన్ని మరుసటిరోజే ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. అదే రోజు (18వ తేదీ) కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించి మీడియాకు ఆ వివరాలు వెల్లడించిన సందర్భంగా ‘ప్రాజెక్టులను అప్పగించలేదు’ అని ముక్తసరిగా తెలిపింది. కానీ ఆ మరుసటి రోజే అంటే 19వ తేదీన కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశ మినిట్స్‌ను అధికారికంగా తెలుగు రాష్ర్టాల ఈఎన్సీలకు పంపింది. లేఖ కూడా బయటికి వచ్చింది. దీంతో అందులోని వాస్తవాల ఆధారంగా తెలంగాణ కృష్ణా ప్రాజెక్టుల కథ ఒడిసిపోయింది అంటూ అన్ని మీడియాల్లో ప్రముఖంగా వచ్చింది. సీఎం, మంత్రులు బుకాయిస్తున్నట్టు ‘మేం ఒప్పుకోలేదు’ అనేది నిజమైతే వెంటనే అదే రోజు కేంద్రానికి లేఖ వెళ్లాలి. కానీ రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి పంపినట్టు చెప్తున్న లేఖ 27వ తేదీన రూపొందించారు. దానిని 29వ తేదీన కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపారు. అంటే అధికారికంగా కేంద్రం ‘తెలంగాణ ఒప్పుకున్నది’ అని మినిట్స్‌లో వెల్లడించిన పది రోజులకుగానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదన్నమాట. మరి ఈ ఆలస్యం వెనక మతలబు ఏమిటి?
జనవరి 17న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా కేంద్ర జల్‌శక్తిశాఖ ఫిబ్రవరి ఒకటో తేదీన హైదరాబాద్‌లోనే సమావేశం కావాలని కృష్ణా బోర్డుకు సూచించింది. ఈ మేరకు రెండు రాష్ర్టాల ఈఎన్సీలకు గత నెల 30వ తేదీన లేఖ రాసింది. వాస్తవానికి గత పదేండ్లలో కేవలం త్రిసభ్య కమిటీ సమావేశాలు మినహా కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశాల్లో ఈఎన్సీలతో పాటు రెండు రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, ఇతర ఇంజినీర్లు కూడా పాల్గొంటారు. తొలిసారి కేవలం ఇద్దరు ఈఎన్సీలతోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా ఈ సమావేశానికి ఒకరోజు ముందు అంటే గత నెల 31వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బోర్డు సమావేశంపై ఈఎన్సీతోపాటు పలువురు అధికారులతో సమావేశమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మీరు సమావేశంలో ఏమీ మాట్లాకుండా… కేంద్ర జల్‌శక్తి శాఖకు గత నెల 27న మనం రాసిన లేఖ ఇచ్చి రండి’ అని మంత్రి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. కానీ ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన సమావేశంలో ఈఎన్సీ మురళీధర్‌రావు గంటల తరబడి ‘ఆపరేషన్ ప్రొటోకాల్’పై చర్చించారు. బోర్డు నిర్వహణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన ఈఎన్సీ అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించారు? మంత్రికంటే పెద్దవారు ఎవరు ఈ మేరకు ఆదేశాలిచ్చారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జలసౌధలో ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన కృష్ణా బోర్డు సమావేశం తర్వాత ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు మాట్లాడకుండా వెళుతుండటంతో మీడియా ఆయన్ని ఆపి, తెలంగాణ తరఫున స్పష్టత ఇవ్వాలని ఒత్తిడి చేసింది. దీంతో ముఖ్య కార్యదర్శితో మాట్లాడి వచ్చి మీడియా బ్రీఫింగ్ ఇస్తానంటూ జలసౌధ రెండో అంతస్తుకు వెళ్లిన ఆయన, తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు. ‘ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల బోర్డు చూసుకుంటుంది. నిర్వహణకు స్టాఫ్ కావాలని బోర్డు అడుగుతున్నది. ఆ మేరకు ఉద్యోగులను కేటాయిస్తాం’ అని తెలిపారు. అదేరోజు ఎలక్ట్రానిక్ మీడియా, రెండో తేదీన అన్ని పత్రికల్లోనూ ప్రాజెక్టుల అప్పగింత నిజమేనని ఈఎన్సీ చెప్పినట్టుగానే వచ్చింది. దీంతో రెండో తేదీన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మేం ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించలేదు. మీడియానే తప్పుడు ప్రచారం చేస్తున్నదని నిందించారు. మరి.. రాహుల్ బొజ్జా అభిప్రాయం ఇదైతే, ఒకరోజు ముందు రాహుల్ బొజ్జాను కలిసి వచ్చిన తర్వాతనే ఈఎన్సీ మీడియాతో మాట్లాడతానని చెప్పారుకదా? మాట్లాడి వచ్చిన తర్వాతే ‘అంతా బోర్డు చూసుకుంటుంది’ అన్నారు కదా? అంటే ఈఎన్సీ ఆ రోజు ఆ పది నిమిషాలు ముఖ్య కార్యదర్శితోనే మాట్లాడారా? మాట్లాడితే ఇద్దరూ భిన్న ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు ఈఎన్సీ మాట్లాడింది ఎవరితో?
కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డు వ్యవహార శైలి కూడా ఈ ఎపిసోడ్లో కొంత అనుమానాస్పదంగా ఉన్నదని నిపుణులు అంటున్నారు. గత నెల 17న జరిగిన సమావేశం తర్వాత గతంలో మాదిరిగానైతే ‘ముసాయిదా మినిట్స్ కాపీ’ని తెలుగు రాష్ర్టాలకు పంపాలి. రెండు రాష్ర్టాల అధికారులు సదరు సమావేశంలో తాము మాట్లాడిన రీతిన మినిట్స్‌లో ఉన్నదా? అని చూసి, భిన్నంగా ఉంటే అభ్యంతరాలు తెలుపుతూ, వాస్తవాన్ని పొందుపరుస్తూ సమాచారం ఇస్తారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతనే తుది మినిట్స్‌ను జారీ చేయాలి. కానీ అలా జరగలేదు. నేరుగా మినిట్స్‌ను పంపితే దానిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పేందుకు ఏకంగా పది రోజుల సమయం తీసుకొన్నది. కనీసం ముసాయిదా ఎందుకు పంపలేదని కూడా తెలంగాణ నీటిపారుదలశాఖ నిలదీయలేదు. మరోవైపు కృష్ణా బోర్డు ఇప్పటివరకు అనేక సమావేశాలు నిర్వహిస్తే మినిట్స్ కాపీని నాలుగైదు రోజులకుగానీ విడుదల చేయలేదు. కానీ ఫిబ్రవరి ఒకటో తేదీ సమావేశ మినిట్స్‌ను మరుసటి రోజే హడావుడిగా విడుదల చేయడం కూడా అనుమానాలకు తావిస్తున్నది. ముఖ్యంగా ముందు ముసాయిదా మినిట్స్ పంపాలని తెలంగాణ ఈఎన్సీ బోర్డుకు లేఖ రాసినప్పటికీ, అందుకు భిన్నంగా ఒక్కరోజు వ్యవధిలోనే తుది మినిట్స్ విడుదల చేశారు. ఈ మినిట్స్ వెంటనే విడుదల చేయడం వెనక ఢిల్లీలో పెద్ద హోదాలో ఉన్న ఒక వ్యక్తి బోర్డుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారనే ప్రచారం కూడా జలసౌధలో చక్కర్లు కొడుతున్నది.
కృష్ణా బోర్డు వ్యవహారం గత నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో సంచలనంగా మారుతూ వచ్చింది. ఈ సమయంలో పలు పర్యాయాలు సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖకు సంబంధించి సమీక్ష జరిపారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంపైనా సమీక్ష నిర్వహించారు. కానీ ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రం ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఆరా తీసినట్టు కూడా సీఎంవో నుంచి సమాచారం బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందనే వార్త వెలువడటంతో హడావిడిగా 4వ తేదీన మీడియా సమావేశం నిర్వహించి, ఈఎన్సీ మురళీధర్‌రావును వెనకేసుకొచ్చి మాట్లాడారు. తాము ఇచ్చిన ఆదేశాలనే ఈఎన్సీ అమలు చేస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈఎన్సీ మురళీధర్‌రావుతోపాటు కాళేశ్వరం (రామగుండం) ఈఎన్సీ వెంకటేశ్వర్లును కూడా రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ‘రాజీనామా ఆదేశాలు’ అనూహ్యంగా తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొసమెరుపు ఏమిటంటే కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంపై సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కనీస సమాచారం కూడా లేకపోవటం!