హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్లను సమకూర్చేందుకు ప్రత్యేకంగా కన్సల్టెన్సీని నియమించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కన్సల్టెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ని స్వీకరించే అంశాలపై ఇప్పటికే టెండర్లను అధికారులు ఆహ్వానించారు. ఆ గడువు 15తో ముగిసిపోనుండటంతో ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీలతో జలసౌధలో సోమవారం ఈఎన్సీ అమ్జద్హుస్సేన్ ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపు నాలుగు కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈవోఐ దాఖలు ప్రభుత్వం ఇచ్చిన గడువు సమయం సరిపోదని వెల్లడించారు. నిర్దేశిత గడువును పొడిగించాలని అధికారులకు సూచించినట్టు సమాచారం. అదేవిధంగా డిజైన్లకు పలు అంశాలు, వివరాలను కోరినట్టు తెలిసింది. అయితే దీనిపై ఇరిగేషన్‌శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.