హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) పలు కొత్త నిబంధనలను పొందుపరచనున్నది. ఈ మేరకు ముసాయిదాను విడుదల చేసి, అభిప్రాయాలను కోరింది. ‘ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజీ రెగ్యులేషన్స్ -1999’ చట్టంలోని క్లాజ్ 2 (5ఏ)లో అర్హతలకు సంబంధించి మార్పులు చేయనున్నది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మెడికల్ కాలేజీని విజయవంతంగా నడిపిస్తున్న వారికి కొత్త కాలేజీ ఏర్పాటుకు ‘కనీసం రెండేండ్ల పాటు దవాఖానను నడిపిన అనుభవం ఉండాలి’ అనే నిబంధన నుంచి మినహాయించింది. ఒకే యాజమాన్యం పరిధిలో కాలేజీ, అనుబంధ దవాఖాన సొంత భవనాల (ఇతర అవసరాలకు వినియోగించని) ను కలిగి ఉండాలి. కాలేజీ అనుమతికి దరఖాస్తు చేసే నాటికి కచ్చితంగా వెయ్యి పడకల దవాఖాన సిద్ధంగా ఉండాలని ఎన్ఎంసీ స్పష్టంచేసింది.