సంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డికి వైద్య కళాశాల రావడానికి సీఎం కేసీఆరే కారణమని, ఆయన కృషితోనే సాధ్యమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే టీ జగ్గారెడ్డి కొనియాడారు. బుధవారం ఆయన సంగారెడ్డిలోని మెడికల్ కాలేజీ భవన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ నాయకుడినైనప్పటికీ సంగారెడ్డి ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్‌ను పొగడక తప్పదన్నారు. సంగారెడ్డి ప్రజలు ఎంతోకాలంగా వైద్య కళాశాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి డిమాండ్‌ను సీఎం కేసీఆర్ నేరవేర్చారని తెలిపారు.
వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని తాను పలుమార్లు సీఎంను కోరానని, దీంతో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వటంతోపాటు మ్యానిఫెస్టోలో కూడా చేర్చి మంజూరు చేశారన్నారు. వైద్యకళాశాల ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సంగారెడ్డికి వచ్చి వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయటంతోపాటు ప్రస్తుతం నిర్మించిన భవనాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకొని సీఎంను సంగారెడ్డికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల వైద్య సిబ్బంది నియామకాలు పూర్తికాగా, భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకొన్నాయని వివరించారు. రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి కావటంతోపాటు ఆగస్టులో తరగతులు ప్రారంభం కావచ్చని చెప్పారు.