హైదరాబాద్: తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీశ్‌రావుకు (Harish Rao) ఏఐజీ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కర్కశత్వం వల్ల ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువారం సాయంత్రం హరీశ్‌రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను కర్కశంగా ఈడ్చిపడేశారు. ఇష్టమొచ్చినట్లు నెట్టేయడంతో ఆయన ఎడమ భుజానికి తీవ్రగాయమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రికి కూడా పోనీయరా..!
నిన్న పోలీస్ తోపులాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానంటే అనుమతించని పోలీసులు.
తన ఇంటి చుట్టూ మోహరించి హౌస్ అరెస్ట్… pic.twitter.com/HqKAMQ7UMp
— BRS Party (@BRSparty) September 13, 2024
అంతకు ముందు బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. భుజం నొప్పిగా ఉన్నదని, దవాఖానకు వెళ్లాలని చెప్పినప్పటికీ అడ్డుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీకి వెళ్లేందుకును పర్మిషన్ ఇచ్చారు. అయితే హరీశ్‌రావుతోపాటు పోలీసులు కూడా దవాఖానకు వెళ్లారు.
కాగా, పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలోనే గాయం కావడంపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల్లో కొందరు కావాలనే హరీశ్‌రావును గాయపర్చినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. ఆయన నొప్పిని భరిస్తూ పోలీసుల తీరును నిరసించారు. చేయి నొప్పి పెడుతున్నదని అరిచినా.. కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇష్టారీతిన ఈడ్చిపడేయడంతో ఆ నొప్పి మరింత తీవ్రతరమైనట్టు తెలిసింది.
సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ నొప్పికి ఎలాంటి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు. బస్సులో గంటల తరబడి తిప్పుతున్నా హరీశ్‌రావు నొప్పిని భరించారు. ఎక్కడైనా ప్రథమ చికిత్స కోసం ఆపాలని పోలీసులను అడిగినా.. ఎవరూ స్పందించలేదని తోటి బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో అలాగే భుజం నొప్పిని భరిస్తూ.. కేశంపేటకు చేరుకున్నారు.