నీలగిరి, డిసెంబర్ 30 : రాష్ట్రంలోని జర్నలిస్టులకు వైద్య సదుపాయం విషయంలో స్పష్టమైన విధానాన్ని తీసుకురానున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జర్నలిస్టుతోపాటు వారి కుటుంబసభ్యులు, తల్లిదండ్రులకు రూ.పది లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా మెరుగైన హెల్త్‌కార్డులు తీసుకురానున్నట్టు చెప్పారు. దేశంలో జర్నలిస్టు లు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఒకే తాటిపైకి తెచ్చి ఇండ్లస్థలాల విషయంలో సుప్రీం తీర్పు నిరాశ పర్చిందని అభిప్రాయపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని చెప్పారు. సోమవారం నల్లగొండ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. మీడియా సంస్థలు తమ స్వభావాన్ని కోల్పోయి రాజకీయ పార్టీలకు అనుసంధానంగా పని చేయడంతో జర్నలిస్టులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారన్నారు. చాలా వాస్తవాలు సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు తెలుస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలోని మంచి సంస్థలకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తున్నదని పేర్కొన్నారు.