ఖైరతాబాద్, సెప్టెంబర్ 4: ‘ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గత ఆరు నెలలుగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. సొంత ఎజెండాతో పనిచేయసాగారు. 18 ఏండ్లుగా బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతిలో భాగంగా ఆమె వెన్నంటి మేమంతా పనిచేశాం. ఇప్పుడు ఆమె వైఖరితో ఏకీభవించలేకపోతున్నాం. ఆమె తన ఆలోచనను మాతో చర్చించనేలేదు. ఆమె వైఖరిని విభేదిస్తూ, ఇక నుంచి తెలంగాణ జాగృతిలో పనిచేయం. ఇప్పటికైనా కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, తెలంగాణ జాగృతిలో కీలక నేతలు స్పష్టంచేశారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియా సమావేశంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడె రాజీవ్‌సాగర్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ తదితరులు మాట్లాడారు. కవిత వైఖరి మారిన నాటి నుంచే ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నామని మేడె రాజీవ్‌సాగర్ తెలిపారు. ఇక ముందు తెలంగాణ జాగృతిలో ఉండదల్చుకోలేదని తెలిపారు.
కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ లబ్ధి పొందుతాయని తెలిపారు. 2006లో నాటి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కవిత నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జాగృతిలో చేరి ఉద్యమ రథసారధి కేసీఆర్, కవిత ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం తన ప్రా ణాన్ని పణంగా పెట్టారని, పార్టీలో తన సొంతవారైనా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటానని చెప్పారని, చెప్పిన మాటకు కట్టుబడి తాజాగా కవితపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్లో కీలక నేతలైన హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై కవిత చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని తెలిపారు. వారిపై కవిత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు.
ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న కేటీఆర్, హరీశ్‌రావుపై కవిత విమర్శలు గుప్పించడం బాధాకరమని రాజారాంయాదవ్ పేర్కొన్నారు. స్వ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తరుణంలో, కవిత వ్యాఖ్యలు వారికే ఊతమిచ్చేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో కవి, రచయిత కే శ్రీనివాస్, అనంతుల ప్రశాంత్, ఉపేందర్‌రావు, శేఖర్, చందుయాదవ్, అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాక్షస పాలన నడుస్తున్నదని, మళ్లీ కేసీఆర్ రావాలి, తెలంగాణ సస్యశ్యామలంగా మారాలని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని, ఈ తరుణంలో కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీలకు ఊతమిచ్చేలా ఉన్నాయని మఠం భిక్షపతి తెలిపారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. 18 సంవత్సరాలు ఆమె నాయకత్వంలో పనిచేశామని, కానీ తమ బాగోగుల కోసం ఆమె ఏం చేశారని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌పై కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి ద్రోహం చేయడమేనని విమర్శించారు. పార్టీ కార్యకర్తకైనా, సామాన్యుడికైనా ఏ సమస్య వచ్చినా వారు స్పందించడమే కాకుండా వారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ వస్తున్నారని తెలిపారు.