వరంగల్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడారం సమ్మక్క-సారలమ్మ కొలువైన గద్దెల కైవారం, ప్రాంగణం విషయంలో పూజారుల నిర్ణయం మేరకే పనులు చేపడతామని ప్రభుత్వం పేర్కొన్నది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ‘మేడారంలో అపచారం! తల్లుల గద్దెలకు సరికొత్త హంగులు.. ఆధునికత పేరుతో సంస్కృతి విచ్ఛిన్నం’ శీర్షికన ఈనెల 6న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం దిగివచ్చింది. తల్లుల గద్దెల కైవారానికి ఆధునిక పేరుతో రాతి స్తంభాలు, శిలాతోరణాలతో మార్పులు చేయాలని సర్కార్ సంకల్పిస్తున్న విషయాన్ని, మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలోని ఆదివాసీ సమాజం అభిప్రాయాల సమాహారంగా వచ్చిన కథనం సంచలనం రేపింది. దేవాదాయ, గిరిజన సంక్షేమశాఖ, రాజకీయ సమన్వయలోపాన్ని ఎత్తిచూపింది.
మరోవైపు ఆదివాసీ సంఘాలు, సమ్మక్క-సారలమ్మ పూజారులు, కోయ తలపతులు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో సర్కార్ దిగొచ్చింది. ఈ మేరకు మంగళవారం ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, గిరిజన, దేవాదాయ శాఖ అధికారులు, పూజారుల సం ఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులతో సమావేశమయ్యారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కాకతీయుల శిల్పాలను తెచ్చి తల్లుల చుట్టూ అలంకరిస్తామంటే ఒప్పుకోమని పూజారులు చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వం తమ సంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా చూస్తే ఊరుకోబోమని, తమతో సంప్రదించకుండా డిజైన్లు రూపొందించి తమ దగ్గర ప్రదర్శించడం సరికాదని వారు అభిప్రాయపడినట్టు తెలిసింది. దీంతో సంప్రదాయాలకు విఘాతం కల్పించబోమని, పూజారుల సూచనల మేరకే చేపడతామని అధికారులు స్పష్టంచేశారు.