హైదరాబాద్ : మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వన దేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలివచ్చారు. మరికొద్దిసేపటల్లో సారలమ్మ గద్దెలపైకి చేరనుండగా.. దర్శించుకొని, మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద భారీగా జనం బారులు తీరారు. తాడ్వాయి మండలం కన్నెపల్లి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సారలమ్మ మేడారానికి బయలుదేరింది. గిరిజన సంప్రదాయం ప్రకారం.. అమ్మవారిని గద్దెల వద్దకు కోయ పూజాలు తోడ్కొని వస్తున్నారు. డోలు, డప్పు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య జంపన్నవాగు దాటి సారాలమ్మ గద్దెలపైకి చేరుకోనున్నది.
అలాగే మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి పడిగిద్దరాజు, ఏటూరునాగారం మండలం కన్నాయిగూడెం నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకోనున్నారు. రేపు సమ్మక్క గద్దెలకి రానున్నది. పున్నమి చంద్రుడి వెన్నెల్లో, విద్యుద్దీప కాంతుల్లో మేడారం వెలుగులీనుతున్నది. మరో వైపు భారీగా తరలివచ్చిన భక్తులతో మేడారం సందడిగా మారింది. భక్తులతో కిటకిటలాడుతున్న గద్దె ప్రాంగణం కిటకిటలాడుతున్నది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలోనే ఉండి, జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి గద్దెలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే వాణిదేవి దర్శించుకున్నారు.