CM Revant Reddy | బీసీల రిజర్వేషన్లను 20 శాతం నుండి 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం ఏ రేవంత్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా కులగణనలో బీసీల లెక్కలు తేలిన తర్వాత కూడా రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఈ ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలు కూడా పెంచినట్టయితే పంచాయతీ సభ్యులుగా, సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తు చేశారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పట్లోళ్ల శశిధర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు డెడికేషన్ కమిషన్ నివేదికతో సహా మరి అసెంబ్లీలో చట్టం చేస్తే రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఏ విధమైన న్యాయపరమైన ఇబ్బందులు ఉండబోవని పట్లోళ్ల శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లను కచ్చితంగా 42 శాతానికి పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.