హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్‌పై హైకోర్టు కొరడా ఝళిపించింది. భూమి వివాదానికి సంబంధించిన ఓ కేసును చట్ట ప్రకారం పరిశీలించి పరిషరించాలన్న ఉత్తర్వులను అమలు చేయలేదన్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ఆయనకు 6 నెలల జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్లోని 2.22 ఎకరాల భూమిపై హకుల వివాదంలో ఇరుపక్షాలకు నోటీసులిచ్చి విచారణ జరపాలని, అనంతరం చట్టప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను కలెక్టర్ అమలు చేయలేదని నల్లవెల్లి లక్ష్మి కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. బోనాల్ లోని 284/ఎ/2 సర్వే తన తాత పేరిట ఉన్న నంబర్లో 2.22 ఎకరాలను మ్యుటేషన్ చేసి, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వాలని నల్లవెల్లి లక్ష్మి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీంతో పిటిషనర్ దరఖాస్తును చట్టప్రకారం పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు 2022 ఆగస్టులో కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లక్ష్మి తాత ఊషయ్య ఆ భూమిని సాదా బైనామా ద్వారా గంగయ్య, నారాయణ, మల్లయ్య అనే వ్యక్తులకు విక్రయించినట్టు తాసీల్దార్, గిర్దావర్ సమర్పించిన నివేదికను పరిశీలించి ఆమె దరఖాస్తును తిరసరిస్తున్నట్టు కలెక్టర్ స్పష్టం చేయడంతో పిటిషనర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. గిర్దావర్, తాసీల్దార్ నివేదికల ఆధారంగానే కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కలెక్టర్ ఉత్తర్వులు చెల్లవని తేల్చింది. భూమిని కొనుగోలు చేసిన గంగయ్య, నారాయణ, మల్లయ్యకు నోటీసులు జారీచేసి, సాదా బైనామా, రెగ్యులరైజింగ్ ప్రొసీడింగ్స్‌ను పరిశీలించి చట్టప్రకారం ఆదేశాలు వెలువరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ నిరుడు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై హైకోర్టులో లక్ష్మి ధిక్కార వ్యాజ్యం దాఖలు చేయడంతో జస్టిస్ కే లక్ష్మణ్ రాహుల్‌రాజ్‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. ఈ జరిమానా 4 వారాల్లో చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును 4 వారాలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.