బంజారాహిల్స్, జనవరి 10 : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 1969 తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను సీఎం రేవంత్‌రెడ్డి 15రోజుల్లోగా నెరవేర్చకపోతే నిరాహార దీక్షతోపాటు పోరాటాన్ని ప్రారంభిస్తామని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు మేచినేని కిషన్‌రావు, సెక్రటరీ జనరల్ దుశర్ల సుదర్శన్‌రావు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్-12లో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై తొలిదశ ఉద్యమం చేసినవారికి రూ.25వేల చొప్పున పెన్షన్ ఇవ్వడంతో పాటు 200 గజాల స్థలం ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టు గుర్తుచేశారు.
సుమారు 3వేల మంది ఉద్యమకారుల్లో ఇప్పటికే కొంతమంది మరణించారని, మరికొంత మంది తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా 1969 ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని, స్మృతివనం నిర్మాణంకోసం కంటోన్మెంట్ ప్రాంతంలో 100 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించేలా చూడాలని డిమాండ్‌చేశారు.