చండ్రుగొండ, మే 3: రైతులు పండించిన పంటలను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. రైతుల పంటలను కొనే ఉద్దేశం కాంగ్రెస్ పాలకులకు లేకపోతే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో పర్యటించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి దామరచర్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించగా, అక్కడున్న రైతులు తమ సమస్యలను విన్నవించారు. వెంటనే ఆయన రైతుల సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి కోరారు. అనంతరం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొనడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కొర్రీలు లేకుండా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కొనేదాక సర్కార్ను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.