హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుంచి వర్షాలు, వరదలు, ముందస్తు జాగ్రత్తలపై అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుంటలు, చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు వస్తున్న వరదపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకొని, చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా శక్తి పథకం కింద పాఠశాలల యూనిఫాంలు కుట్టడం పూర్తి అయ్యాయని, పాఠశాల ప్రారంభంలోపే విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కార్యదర్శి అనితారామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫియుల్లా, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉపాధిహామీని నీరుగారుస్తున్న బీజేపీ ప్రభుత్వం
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగాఉన్నప్పడు తెచ్చారని గుర్తుచేశారు. రాజ్యసభ సభ్యుడు శివదాసన్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడతూ ఉపాధి హామీ పథకం రక్షణ కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఈ సదస్సులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంట్రాములు, అధ్యక్షుడు నాగయ్య, ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.