హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పశుసంపద పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పెద్ద ఎత్తున గొర్రెలను పంపిణీ చేశామన్నారు. పశువులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించేందుకు అర్హులైన మహిళా సంఘాల ప్రతినిధులను ఎంపిక చేసి శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. శనివారం రాజేందర్‌నగర్‌లోని టీఎస్ఐఆర్డీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) డ్వాక్రా సంఘాల మహిళలకు పశువులకు ప్రాథమిక చికిత్స చేసే ‘పశుమిత్ర’ల మొదటి బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు.
అనంతరం శిక్షణ పూర్తి చేసుకొన్న వారికి కిట్లు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు గ్రామీణుల జీవనోపాధికి కీలక ఆదాయ వనరులని చెప్పారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు పశువులకు ప్రాథమిక చికిత్సపై శిక్షణ ఇస్తున్నదని తెలిపారు. పది చదివిన ఆసక్తిగల 2,359 మంది డ్వాక్రా మహిళలకు శిక్షణనిస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత పశుమిత్రలకు సర్టిఫికెట్ జారీ చేస్తారని, వీరు రైతులకు 24 గంటలపాటు ఎమర్జెన్సీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. దేశంలోనే వినూత్నంగా పశుమిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సెర్ప్ డైరెక్టర్ సత్యకుమారి, వై నర్సింహరెడ్డి, సువిధ, పద్మ, ప్రొఫెసర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఉత్పత్తులకు ఎంవోయూ
మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు సెర్ప్ మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకొన్నది. శనివారం రాజేంద్ర నగర్‌లోని టీఎస్ఐఆర్డీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా డబ్ల్యూబీఐఈ సీఈవో సురేశ్‌బాబు ఒప్పంద పత్రాలు మార్చుకొన్నారు.