ఆదిలాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రైతులు కష్టపడి పండించిన పంటలను కనీస మద్దతు ధరతో కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డును సందర్శించి జొన్నల అమ్మకంలో రైతులు పడుతున్న ఇబ్బందులను శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. జొన్న పంటను మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు పది రోజులుగా పడిగాపులు కాయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
రాత్రింబవళ్లు ఇక్కడే ఉంటున్నారని, వర్షాలతో పంటను నష్టపోతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని, వానకాలం పంటలకు సిద్ధమవ్వాల్సిన సమయంలో మార్కెట్‌యార్డులో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 46 డిగ్రీల మండుటెండలో రైతులు తిండీ తిప్పలు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల బాధలు తీర్చాలని, అప్పటివరకు రైతులకు అండగా ఉండి బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు.