హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఆందోళనకు తెరదించుతూ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. శుక్రవారం ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజు రెండు సెషన్లలోను ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చినట్టు నిపుణులు విశ్లేషించారు. ఎప్పుడూ టెన్షన్ పెట్టే కెమిస్ట్రీ ప్రశ్నలు ఈసారి సులభం నుంచి మధ్యస్థంగా వచ్చాయని, ఫిజిక్స్, గణితం ప్రశ్నలు కాస్త కఠినంగా ఉన్నట్టు తెలిపారు.
ఇంటర్ సిలబస్ నుంచే అత్యధికంగా ప్రశ్నలు వచ్చాయని, సెకండియర్ నుంచి కొంత ఎక్కువగా వచ్చినట్టు తెలిపారు. మొత్తంగా ప్రశ్నలు జేఈఈ మెయిన్ తరహాలో ఉన్నాయని ఎంసెట్, జేఈఈ శిక్షకుడు డాక్టర్ పవన్‌కుమార్ కాసు విశ్లేషించారు. గణితంలో కాలికులేషన్స్ ఎక్కువగా చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. మెరిట్ విద్యార్థులు 80 మార్కుల వరకు స్కోర్ చేయవచ్చన్నారు.
94 శాతం మంది విద్యార్థుల హాజరు
ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల తొలిరోజైన శుక్రవారం 94 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లకు 34 వేల మందికి గాను 32 వేల మంది చొప్పున హాజరైనట్టు పేర్కొన్నారు. ఉదయం సెషన్లో తెలంగాణలో 95.28 శాతం, ఏపీలో 92.45 శాతం, మధ్యాహ్నం సెషన్లో తెలంగాణలో 95.27 శాతం, ఏపీలో 93.24 శాతం చొప్పున విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపారు.
లోదుస్తుల్లో సెల్‌ఫోన్‌తో పరీక్షకు హాజరు
ఎంసెట్ పరీక్షల్లో నిబంధనను ఉల్లఘించిన ఓ విద్యార్థి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ గండిమైసమ్మ వద్ద గల ఓ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి లోదుస్తుల్లో సెల్‌ఫోన్‌తో పరీక్షకు హాజరయ్యాడు. సమాధానాల కోసం సెల్‌ఫోన్‌తో గూగుల్‌లో సెర్చ్ చేస్తుండగా గుర్తించిన ఇన్విజిలెటర్, అబ్జర్వర్లు, ఆ విద్యార్థిని పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదుచేశారు. పోలీసులకు సమాచారమివ్వడమే కాకుండా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.