హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): దేశంలోని నూతన ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కేలా చేసి ప్రోత్సహించడంలో ‘పేటెంట్, డిజైన్స్ ఎగ్జామినర్ల’ది కీలక పాత్ర అని ఎంసీఆర్హెచ్చార్డీ డీజీ శశాంక్ గోయల్ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 122 మంది ఎగ్జామినర్లకు ఎంసీఆర్హెచ్చార్డీలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. 16 వారాలపాటు శిక్షణ కొనసాగుతుందని శశాంక్ చెప్పారు.
దేశంలో పేటెంట్లు, డిజైన్ల దరఖాస్తులను పరిశీలించడంలో ఎగ్జామినర్లే ముందువరుసలో ఉంటారని తెలిపారు. క్షుణ్ణంగా తనిఖీ చేసి, అర్హత కలిగిన దరఖాస్తులను ఆమోదించేలా చూడాలని, తద్వారా కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చినట్టు అవుతుందని సూచించారు. ఎగ్జామినర్లు సమర్థంగా పనిచేస్తే భవిష్యత్తులో ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎకోసిస్టమ్’ ఏర్పడుతుందని తెలిపారు.