హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6 వరకు కౌన్సెలింగ్ జరగనున్నది. వారం రోజుల వ్యవధిలో రాష్ట్ర స్థాయిలో ఆయా యూనివర్సిటీలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ తర్వాత ఫిజికల్‌గా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూలై 21 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానున్నట్టు పేర్కొంది. గత నెల 14న నీట్ ఫలితాలు విడుదల కాగా, రెండు రోజుల క్రితం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటించింది. దీంతో మన రాష్ట్రంలో ఈనెల 30న కౌన్సెలింగ్ ప్రారంభమై, అక్టోబరు 3తో ముగుస్తుంది. త్వరలోనే కాళోజీ వర్సిటీ ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వనున్నది.