CM KCR | ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలు, ఆవాసాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ సమస్యలతో సతమతమయ్యేవారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక సీజనల్ వ్యాధులు పట్టి పీడించేవి. తమ సమస్యలు పరిష్కరించాలని, గత ప్రభుత్వాలను కోరినా ఫలితం మాత్రం శూన్యం. తాము ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతేనే సమస్యలు పరిష్కారం సాధ్యమవుతాయని తమ గ్రామాల్లో తమ పాలన (మావ నాటే మావ రాజ్) అనే ఆలోచన వారిలో వచ్చింది. దీంతో ఆదివాసీ గూడేలు, తండాలను గ్రామ పంచాయ తీలుగా గుర్తించాలని ఆదివాసీలు, గిరిజనులు ఎంతో కాలంగా కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వీరి గోడును పట్టించుకోలేదు.
కల సాకారం చేసిన కేసీఆర్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల కలను నిజం చేశారు. మావనాటే, మావరాజ్ అనే నినాదాన్ని అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,416 ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. దీంతో 31 వేల మంది ఆదివాసీలు, గిరిజనులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా పరిపాలనలో భాగస్వాములయ్యారు. వారి గ్రామాల్లో స్వయంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తమ పల్లెల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఆదివాసీ, గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడానికి భారీగా నిధులు మంజూరు చేసింది. గతంలో తమ పల్లెలు ఇతర గ్రామ పంచాయతీల్లో ఉండడంతో వారు సమస్యల పరిష్కారం కోసం అక్కడి సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నేరుగా అధికారులు, కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
పల్లె ప్రగతితో మరింత అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమం కొత్తగా ఏర్పడిన ఆదివాసీ, గిరిజన పంచాయతీల పాలిట వరంగా మారింది. పల్లె ప్రగతిలో నిధులతో ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలు అభివృద్ధిలో ఇతర పంచాయతీలతో పోటీ పడుతున్నాయి. గ్రామాల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం, డంప్ యార్డులు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, పచ్చదనం, సెగ్రిగేషన్ షెడ్లతో గిరిజన గ్రామాలు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి.
గిరిజన గ్రామాల్లో స్వయం పాలన
ప్రభుత్వం ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో స్వయం పాలనకు అవకాశం కలిగింది. మేమే సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా ఎన్నికవుతున్నం. గతంలో మేం ఇతర పంచాయతీల్లో ఉండడంతో సమస్యల పరిష్కారం కోసం అక్కడి నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మేమే గ్రామసభల్లో అవసరమైన పనులు గుర్తించి అధికారులకు చెప్తున్నం.
-పెందూర్ లక్ష్మణ్, సర్పంచ్ (లోకారి, ఆదిలాబాద్ రూరల్ మండలం)
గతంలో చూడనంత అభివృద్ధి
మా గ్రామం ఇంతకు ముందు గిరిగాం పంచాయతీలో ఉండేది. 573 మంది జనాభా ఉన్న అంబుగాంను ప్రభుత్వం కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఇంతకు ముందు కనీస సౌకర్యాలు లేక ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. ఇప్పడు బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు కట్టుకున్నం. పల్లెప్రగతి ట్రాక్టర్ ఇచ్చిన్లు. పంచాయతీకి వచ్చే నిధులతో ప్రజలకు అవసరమైన సౌలత్లు చేస్తున్నం.
– ఆత్రం తుర్పాబాయి, సర్పంచ్ (అంబుగాం గ్రామం, తాంసి మండలం, ఆదిలాబాద్ జిల్లా)
…?బాకే రఘునాథ్ రావు