BRS | వరంగల్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయం అయాయి. లక్షలాదిగా తరలివచ్చే జనానికి తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. మొత్తంగా గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగ అద్భుతంగా జరిగేలా ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగకు లక్షలాది మంది తరలిరానున్నారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది. 14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, 2014 నుంచి పదేండ్లపాటు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన బీఆర్ఎస్ సుపరిపాలన మేళవింపుగా ఈ రజతోత్సవ మహాసభ ఆసాంతం ఉండనున్నది. బీఆర్ఎస్కు చెందిన జెండాలు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో ఎల్కతుర్తి పూర్తిగా గులాబీశోభను సంతరించుకుంది.
మహాసభ ప్రాంగణానికి వచ్చే అన్ని దారుల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ఉన్న జెండాలతో ఆ ప్రాంతం మొత్తం గులాబీ మయమైంది. ఎల్కతుర్తి ప్రధాన జంక్షన్లో పెట్టిన కేసీఆర్ భారీ కటౌట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. వేదిక ముందు 25 వసంతాల బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు, కార్యకర్తలు అక్కడ ఉత్సాహంగా ఫొటోలు దిగుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు జరిగాయి. నేతల నిర్విరామ కృషితో సర్వం సిద్ధమైంది.
బీఆర్ఎస్ మహాసభతో ఎల్కతుర్తి పూర్తిగా కొత్త రూపును సంతరించుకున్నది. బండ్ల బాటులు పెద్ద రోడ్లుగా మారాయి. పెద్ద రోడ్లు మరింత బాగా తయారయ్యాయి. ఎల్కతుర్తిలోని దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముండ్ల చెట్లను తొలగించారు. ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు. రైతుల పొలాల్లో ఎక్కడా ఒక్క పిచ్చి మొక్క కనిపించకుండా, ముండ్లకంప లేకుండా చదనయ్యాయి. బీఆర్ఎస్ మహాసభ కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. ఎల్కతుర్తి పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. బీఆర్ఎస్ మహాసభతో ఎల్కతుర్తికి కొత్త గుర్తింపు వచ్చిందని అంటున్నారు.
ఎల్కతుర్తిలోని 1,213 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం సిద్ధమైంది. 500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దాదాపు 50 వేల వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్, రెడ్ కార్పెట్లు ఏర్పాటుచేశారు. మహాసభకు ముందుగా వచ్చిన వారు కూర్చునేలా లక్షకుపైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. పగటిపూటను తలపించేలా వెలుగులు విరజిమ్మేలా లైట్లను అమర్చారు. లైట్లు, ఎల్ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదిక లైటింగ్ పనులు పూర్తయ్యి పండుగ వాతావరణం సంతరించుకోవడంతో చూసేందుకు వచ్చిన ఎల్కతుర్తి ప్రజలు. రాత్రివేళ ధగధగ వెలిగిపోతున్న ‘గులాబీ మైదానం’ వద్ద అక్కడికి వచ్చిన స్థానిక మహిళలు.. పిల్లలతో కాసేపు సరదాగా గడపడం కనిపించింది.