e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home Top Slides బండారం బట్టబయలు

బండారం బట్టబయలు

బండారం బట్టబయలు
  • రైతుల ఫిర్యాదుతో కదిలిన తేనెతుట్టె
  • వీడుతున్న పాత అక్రమాల గుట్టు
  • పౌర సరఫరాల మంత్రిగా ఉండగా ఆ శాఖలో భారీగా అవకతవకలు?
  • వాటిలోనూ ఈటలకు పాత్ర!
  • విచారణ ఖాయమన్న అధికారవర్గాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలతో అధికారవర్గాలు విస్తుపోయాయి. సీనియర్‌ మంత్రి అయిన ఈటల ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడం ఏమిటని అవి విస్మయపడ్డాయి. అనేక ఏండ్లు మంత్రిగా ఉన్న వ్యక్తికి అసైన్డ్‌ భూముల గురించి పూర్తిగా తెలుసునని, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం ద్వారా వాటిని దక్కించుకోచూడటం, ముఖ్యమంత్రి, అధికారులు అందుకు అంగీకరించకపోవడంతో, రైతులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం విచారకరమని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈటల పైకి కనిపించేంత, మాటలు చెప్పేంత నీతిమంతుడేమీ కాదని ఆయనకు సన్నిహితంగా మెలిగిన ఒక అధికారి అన్నారు. ఈటల గతంలో పౌరసరఫరాల శాఖ మం త్రిగా ఉన్నప్పుడు, ఆ శాఖలో భారీ అక్రమాలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఆ అక్రమాల్లో ఈటల పాత్ర కూడా ఉందని తెలిపారు. తన లోగుట్టు బయటపడుతుందనే భయంతోనే ఈటల కొంతకాలంగా నర్మగర్భ వ్యాఖ్య లు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబసభ్యులపై ప్రైవేటు సంభాషణల్లో ఈటల చేస్తున్న దాడి కూడా తన వ్యవహారాలు బయటకు రాకుండా బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రయత్నాల్లో భాగమని అధికార వర్గాలు వివరించాయి. తాజాగా ఈటల బండారం బయటపడిన నేపథ్యంలో, పౌరసరఫరాల శాఖలో జరిగిన అక్రమాలతో సహా అన్నింటిపైనా ప్రభుత్వం విచారణ జరిపి, నిజాలను బయటపెడుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులకు భూసేకరణ పేరుతో ప్రభుత్వం అసైన్డ్‌ భూములను తీసుకోవడం లేదా? తాను తీసుకుంటే తప్పేమిటి? అని విలేకరుల సమావేశంలో ఈటల వేసిన ప్రశ్నతోనే ఆయన తప్పు చేసినట్టు స్పష్టమైందని అవి వివరించాయి. ‘విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ఏ భూమినైనా, ఎవరి భూమినైనా, అది పట్టా అయినా, అసైన్డ్‌ అయినా, మరోటి అయినా, తీసుకునే అధికారాన్ని రాజ్యాంగమే ప్రభుత్వానికి కల్పించింది.

దాన్నీ, తాను కంపెనీ కోసం అసైన్డ్‌ భూముల్లో కబ్జా పెట్టడాన్ని ఈటల అసలు ఎలా పోల్చుకుంటారు? ఇన్నేం డ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ మాత్రం తెల్వదా? ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు’ అని ఒక సీనియర్‌ అధికారి అన్నారు. ‘బడుగు బలహీన వర్గాల ప్రతినిధినని చెప్పుకొనే మంత్రే, తనకు వందల ఎకరాల భూములున్నాయని అంగీకరిస్తూనే, బడుగుల భూములు వారిని సాగు చేసుకోనివ్వకుండా గుంజుకునే ప్రయత్నం చేయడం విచిత్రం. ఈటల చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదనడానికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి లేదు. మంత్రులే ఇట్ల చేస్తే ఇక వేరేవాళ్ల సంగతి అడిగేదేముంది?’ అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంమీద రైతుల ఫిర్యాదుతో ఈటల అసలు రంగు బయటపడిందని అన్నారు. ప్రభుత్వం కూలంకషంగా విచారిస్తే అధికారికంగా ఆయన దోషి అని తేలడం ఖాయమని చెప్పారు.

దేవరయాంజాల్‌లో దేవాదాయ భూములపై కన్ను
మెదక్‌ రైతుల ఫిర్యాదు సంగతి బయటపడగానే, ఈటల అవకతవకలకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌ శివారులోని (శామీర్‌పేట) దేవరయాంజాల్‌ ప్రాంతంలో ఈటలకు భారీ ఎత్తున భూములున్నాయని, వాటి విషయంలో కూడా పలు అవకతవకలు జరిగాయని ఆ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్‌ చేసి చెప్పారు. ఇక్కడ దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కావడంలో ఈటల హస్తం ఉందని వారు పేర్కొన్నారు. వీటిపైనా ప్రభుత్వం విచారణ జరిపించాలని, అవసరమైతే దీనిపై తాము ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

అసైన్డ్‌ భూమి ఆక్రమిస్తే ఆర్నెళ్ల జైలు

  • భూమిని ఎవరూ కొనరాదు, అమ్మరాదు
  • లబ్ధిదారు, వారసులే అనుభవించే హక్కు
  • స్పష్టం చేస్తున్న పీవోటీ చట్టం-1977

అసైన్డ్‌ భూములను ఎవరైనా ఆక్రమించినా, కొనుగోలు చేసినా ఆర్నెళ్ల జైలు శిక్ష తప్పదని అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ)-1977 స్పష్టం చేస్తున్నది. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం సాగు చేసుకునేందుకు, లేదా ఇంటి నిర్మాణానికి ఇచ్చిన భూమిని అసైన్డ్‌ భూమిగా పేర్కొంటారు. ఈ భూమిని లబ్ధిదారు, వారి వారసులు వారసత్వంగా అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంటుంది. ఇతరుల పేర్ల మీదికి బదలాయించడం, అమ్మడం, దానం ఇవ్వడం, కౌలుకు ఇవ్వడాన్ని పీవోటీ-1977 చట్టం నిషేధిస్తున్నది. ఒకవేళ ఎవరైనా అసైన్డ్‌ భూములను కొన్నా ఈ చట్టం ప్రకారం వారికి ఎలాంటి హక్కులు దఖలు పడవు. ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం చట్టప్రకారం నేరం. అది అసైన్డ్‌ భూమి అని కోర్టు తేల్చినా, ఆక్రమణలు కొనసాగిస్తే శిక్షార్హం అవుతుంది. కోర్టు గరిష్ఠంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.2000 వరకు జరిమానా లేదా రెండు శిక్షలు కలిపి వేయవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బండారం బట్టబయలు

ట్రెండింగ్‌

Advertisement