హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ) : శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగ్ నుంచి రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. బస్సు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు బస్సులో ప్రయాణిస్తుండగా బ్యాగ్‌లో నగలు కనిపించకపోవడంతో డయల్ 100కు కాల్ చేసింది. విషయాన్ని బస్సు డ్రైవర్‌కు తెలుపగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద బస్సును నిలిపివేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో బస్సును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధిత మహిళ మాట్లాడుతూ.. బస్సు ఎక్కేటప్పుడు తన బ్యాగ్‌లో రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు పెట్టుకొని బయల్దేరానని, బ్యాగ్ తన వద్దే ఉందని, ఇంతలోనే బ్యాగ్ నుంచి బంగారు ఆభరణాలు మాయమైనట్టు లబోదిబోమంది. పోలీసులు ప్రయాణికుల బ్యాగ్‌లు, పర్సులను తనిఖీ చేసినా నగల ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు మధ్యలో ఎవరైనా దిగారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.