హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సంస్థ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం బాధితులు సీసీఎస్ ఉన్నతాధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈవీకే ప్రాజెక్ట్స్, ఈవీకే అవాస, జీఎస్సార్ అవాస పేర్లతో శంకర్పల్లి మోకిలా, కొల్లూర్ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మిస్తున్నామంటూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్‌రావు(జీఎస్సార్), డైరెక్టర్లు గుంటుపల్లి పద్మజ, వంశీకృష్ణ చౌదరి, ఇదిర, అనూష గుంటపల్లి, గుంటపల్లి సమంత సోషల్‌మీడియాతోపాటు వివిధ ప్రసార మాద్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. వీటిని చూసిన పలువురు అడ్వాన్స్‌లు చెల్లించారు. సుమారు 11 ఎకరాల్లో ఆరు బ్లాక్‌లలో ఆకాశ హర్మ్యాలు, మరికొంత స్థలంలో విల్లాలు నిర్మిస్తామంటూ బ్రోచర్లు తయారు చేశారు. ఫ్లాటు, ఇండ్లు ఇలా ఉండబోతున్నాయంటూ గొప్పగా చెప్పారు. ఆ బ్రోచర్లు చూసిన బాధితులు నిజమని నమ్మేశారు. 2021లో అడ్వాన్స్‌లు తీసుకొని 2023 వరకు ప్రాజెక్ట్ పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగిస్తానంటూ ఆనాడే హామీ ఇచ్చారు. ఇందులో కొందరు రూ.20 లక్షలు, మరికొంరు రూ.50 లక్షలు, ఇంకా కొందరు రూ.కోటికిపైగా చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేశారు.
ఇచ్చిన హామీ మేరకు మూడేండ్లు దాటినా నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో యజమాని గుంటుపల్లి శ్రీనివాస్‌రావును నిలదీశారు. దీంతో ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేస్తానని కొందరికి, మరికొందరికి త్వరలో నిర్మాణాలు చేస్తానని చెప్పి నమ్మబలికాడు. మొదట జుబ్లీహిల్స్, ఆ తరువాత బంజారాహిల్స్, మాదాపూర్‌కు తన కార్యాలయాన్ని మార్చారు. కాలాయపన చేస్తుండటంతో నారాయణగూడకు చెందన ఇద్దరు బాధితులు జుబ్లీహిల్స్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మే నెలలో కేసు నమోదు చేసి, ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. పక్కా ఫ్లాన్‌తో శ్రీనివాస్‌రావు తమ ను మోసం చేస్తున్నాడని గుర్తించిన సుమారు 100 మంది బాధితులు బుధవారం సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రీలాంచ్ పేరుతో మోసం చేశాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రావును అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలని కోరారు.