నెల్లికుదురు, ఫిబ్రవరి 23: నలుగురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. నాలుగు రోజులపాటు దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (23) ఇంటర్ పూర్తిచేసింది. ప్రస్తుతం పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 17న బయటికి వెళ్లిన యువతి రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అంతటా వెతికారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏ విషయం చెప్పకుండా మరుసటి రోజు ఉదయం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 22న సాయంత్రం మృతిచెందింది. ఆమె వద్ద లభించిన సూసైడ్ నోట్లో గ్రామానికి చెందిన యాట సాగర్, నజీమ్, సద్దాం హుస్సేన్, కోయిలకొండ్ల జగదీశ్‌లు ఎవరికి చెప్పుకోలేనంతగా తనను బాధపెట్టారని ఉన్నది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తొర్రూరు సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. సదరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.