హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28(నమస్తే తెలంగాణ) : టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉద్యోగులు కదం తొక్కారు. డిస్కమ్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. టీఈఈజేఏసీ , టీజీపీఈజేఏసీలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఉద్యోగులు, సిబ్బంది మహాధర్నాకు దిగడంతో మింట్‌కాంపౌండ్ దద్దరిల్లిం ది. ఉద్యోగుల హక్కుల విషయంలో సీఎండీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగినట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ యాజమాన్యానికి మంగళవారం నోటీస్ ఇవ్వగానే, బుధవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలో చర్చలకు వెళ్లిన జేఏసీ ప్రతినిధులకు సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ అందుబాటులో లేకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో ధర్నాను విరమిస్తేనే చర్చలంటూ మరోసారి సీఎండీ నుంచి సమాచారం రావడంతో, ఉద్యోగులు మరింత అసహనానికి లోనయ్యారు.
ఓవైపు ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుండగా, డైరెక్టర్లతో సీఎండీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకూ ఆందోళన విరమించేది లేదంటూ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగుల బదిలీల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో గతంలో మాదిరిగా జూన్, జూలైలలోనే బదిలీలు నిర్వహించాలని, బదిలీల కాలపరిమితిని రెండేండ్లు కాకుండా మూడేండ్లుగా ఉంచాలని డిమాండ్ చేశారు. బదిలీలు జోన్ టు జోన్ కాకుండా సర్కిల్ టు సర్కిల్ చేయాలని కోరారు. ఉద్యోగులకు ఆరోగ్య చికిత్సకు ఇంతవరకు ఉన్న అన్ని కార్పొరేట్ దవాఖానలను కొనసాగించాలని, ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. పీఆర్ఎస్, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని, ఆర్టిజన్ల గ్రేడ్ పెంచాలని జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
మహాధర్నాలో ఉద్యోగులు, అధికారులు పాల్గొనకుండా టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం విశ్వ ప్రయత్నాలు చేసింది. సిబ్బందికి సంబంధించిన హాజరుపై సంబంధిత అధికారులు, డైరెక్టర్లతో ఆరా తీసింది. సర్కిల్ కార్యాలయాల్లో గంటగంటకు అటెండెన్స్ తీసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. మరోవైపు ఈ నిరసనలో పాల్గొన్న వారిపై నిఘా పెట్టిన ప్రభుత్వం, ఎస్పీడీసీఎల్ యాజమాన్యం వారిని గురించిన వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. మహాధర్నాకు వెళ్లిన వారికి గైర్హాజరు వేయాలని యాజమాన్యం ఆదేశించినట్టు సమాచారం రావడంతో జేఏసీ ప్రతినిధులు డిస్కం యాజమాన్యం కక్షపూరిత చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం జేఏసీ ప్రతినిధులను చర్చలకు పిలిచింది. ఎర్రగడ్డ స్కాడా కార్యాలయంలో చర్చలు జరిగాయి. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు విఫలమైనట్టు సమాచారం. చివరకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు వాయిదా వేసినట్టు సమాచారం అందడంతో రిలే నిరాహారదీక్షలు, నిరసనలు వాయిదా వేసినట్టు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.

విద్యుత్తు ఉద్యోగుల పోరాటాన్ని అణచివేయాలని చూస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు తెలిపారు. చిన్న సమస్యను జఠిలం చేయాలని చూస్తున్నారని, దీనికి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ధర్నాలో జేఏసీ ప్రతినిధులు శ్రీధర్, బీసీ రెడ్డి, పీ అంజయ్య, సుధాకర్‌రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, మేడి రమేశ్, దాసరి శ్యాంమనోహర్, మాతంగి శ్రీనివాస్, గోవర్ధన్, నారాయణనాయక్, అక్బర్, కరెంట్ రావు, వెంకటేశ్వర్లు, కుమారస్వామి, భానుప్రకాశ్, నాగరాజు, నాసర్షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు ఉద్యోగుల పట్ల సర్కారు మొండి వైఖరిని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించా రు. యాజమాన్యం తీరు దుర్మార్గమని మం డిపడ్డారు. బదిలీల పేరిట వారి పిల్లల భవిష్య త్తుతో చెలగాటమాడటం సరికాదని పేర్కొన్నా రు. విద్యుత్తు జేఏసీల న్యాయమైన డిమాండ్ల ను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు బదిలీల మార్గదర్శకాలు ఒక కారణమైతే ఆంధ్ర తెలంగాణ వివాదం మరో కారణంగా చర్చ జరుగుతున్నది. జోన్ పరిధిలో ఐదేండ్లు పూర్తి చేసిన వారిని మరోజోన్కు బదిలీ చేయనున్నట్టు మార్గదర్శకాలు రావడంతో, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రూరల్ ఏరియాలో పనిచేస్తున్న సీమాంధ్ర వారిని గ్రేటర్లో తిష్ఠ వేయించడానికే ఈ నిబంధన తీసుకొచ్చారంటూ విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ కుట్ర వెనుక హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి ఆలోచన ఉందని, ఆయన మే నెలలో రిటైరవబోతున్న క్రమంలో ఇప్పటికిప్పుడు బదిలీలకు తెరలేపారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధానం వల్ల తెలంగాణ ఉద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రా అధికారుల ఆధిపత్యం కొనసాగించడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యం ప్రయత్నించడం దారుణంగా ఉందని ఉద్యోగులు వాపోయారు. ఇటీవల రాజకీయ నాయకుల శుభాకాంక్షల లెటర్లు తమతో పంపిణీ చేయించారని, మరోవైపు డ్రెస్‌కోడ్ పెట్టి తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులు కదం తొక్కారు. డిస్కమ్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టారు. టీఈఈ జేఏసీ, టీజీపీఈ జేఏసీ సంయుక్త పిలుపు మేరకు బుధవారం ఉద్యోగులు, సిబ్బంది మహాధర్నాకు దిగడంతో మింట్‌కాంపౌండ్ దద్దరిల్లింది. ఉద్యోగుల హక్కుల విషయంలో సీఎండీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగినట్టు జేఏసీ ప్రకటించింది.