Assembly | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఆవరణలో మునుపెన్నడూ లేనివిధంగా వందలాది మంది మార్షల్స్‌ను మోహరించారు. ఏదైనా గొడవ జరిగితే మాత్రమే స్పీకర్ అనుమతితో మార్షల్స్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బయటకు తీసుకెళ్తారు. కానీ, ఈసారి దీనికి భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లక్ష్యంగా మార్షల్స్ నిలుచున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎల్పీ కార్యాలయం ఎదుటే అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలను ప్లకార్డులతో శాసనసభలోకి అనుమతించబోమని మార్షల్స్ చెప్పారు.
దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. టీ షర్టులు విప్పించారని, ఫొటోలు అనుమతించబోమని చెప్తున్నారని, ఇక బట్టలు విప్పి రావాల్నా అంటూ తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎండిపోయిన వరి కంకులు, కందిళ్లను కూడా లోపలకు తీసుకెళ్లి ప్రదర్శించిందని మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు గుర్తు చేశారు. తమనెందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని వారిని శాసనసభలోని ఇన్నర్లాబీల్లో కూడా భారీ ఎత్తున మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష సభ్యులు రాకపోకలు సాగించే గేటు వద్ద వీరిని పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో సభ్యులు లోపలికి బయటకు వచ్చేందుకు ఇబ్బందిపడ్డారు. ఎమ్మెల్యేల పట్ల మార్షల్స్ మొరటుగా వ్యవహరించారని, తోసే ప్రయత్నం చేశారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మాజీ సభ్యులకు నో ఎంట్రీ
రాష్ట్ర శాసనసభ చరిత్రలో తొలిసారిగా ఇన్నర్లాబీల్లోకి మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనసమండలి సభ్యులు, మాజీ ఎంపీలకు ప్రవేశం లేదన్న బోర్డులు ఏర్పాటు చేశారు. మాజీ సభ్యులను గౌరవించడం సంప్రదాయం. పెన్షన్లు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మాజీ ప్రజాప్రతినిధులు తాజా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్నర్లాబీల్లో కలుస్తుంటారు. సోమవారం నుంచి తీసుకొచ్చిన కొత్త నిబంధనపై మాజీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలా తమను నిలువరించలేదని, స్పీకర్ దీనిపై పునరాలోచన చేయాలని వారు విజ్ఙప్తి చేశారు. ఇన్ని ఆంక్షలు పెట్టి ప్రజాపాలన అంటే ఎట్లా అని ఓ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.